Sankranti Cockfights: సంక్రాంతి సంబరాలు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందేలు, జూదాలు..
ABN , Publish Date - Jan 15 , 2026 | 09:04 AM
ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా సంక్రాంతి సంబరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు నిస్సహాయులయ్యారు. కళ్లెదుదే పందెం పుంజులు కత్తులు రువ్వుతున్నా, పేకలు గాల్లో ఎగురుతున్నా, గుండు గిరగిరా తిరుగుతున్నా వీక్షణకే పరిమతయ్యాయి. దుకాణాల నుంచి వాహనాల్లో కేసుల కొద్దీ మద్యం బరుల వద్దకు చేరుకుంటున్నా ఆపలేని స్థితిలో ఎక్సైజ్ అధికారులున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా: మైలవరం, తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది మండలాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు, జూదాలు సాగాయి. పలుచోట్ల వందేలు చూసేందుకు ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో, ఇబ్రహీంపట్నం, చిన్నలంక, మూలపాడు, తుమ్మలపాలెం, చిలుకూరు గ్రామాలు.. జి.కొండూరు మండలం జి.కొండూరు, కందులపాడు, కోడూరు, కట్టుబడిపాలెం, మునగపాడు, గంగినేనిపాలెంలలో విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి కాలనీ.. మైలవరం మండలం మైలవరం, చండ్రగూడెం, మొర్సుమల్లి, పొందుగల, వెల్వడం గ్రామాలు.. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో పెదకొమెర, నెమలి, తునికిపాడు, పెనుగొలను, గుళ్లపూడి గ్రామాలు తిరువూరు మండలం పట్టణంలో మూడు చోట్ల, మల్లెల, కాకర్ల, కోకిలం పాడు.. విస్సన్నపేట మండలం తాతకుంట్ల, కొర్లమండ, పుట్రేల, వేమిరెడ్డిపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున కోడి వందేలు, జూదాలు యదేచ్చగా జరిగాయి. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాలతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో ముందస్తుగా ఏర్పాటు చేసిన కోడి పందేల బరులను రెవెన్యూ, పోలీస్ అధికారులు ముందస్తుగా నిలిపేసినా మళ్లీ వాటిని తెరిచారు. వత్సవాయి, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో తెలంగాణకు చెందిన ప్రజలు ఎక్కువగా కనిపించారు.
గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కోడిపందాలు, పేకాట శిబిరాలు కొనసాగాయి. బైపాస్ రోడ్డు లోని గౌతమ్ స్కూల్ వెనుక, టిడ్కోకాలనీ వద్ద, రామన పూడి క్వాలిటీ పీడ్స్ పక్కన భారీ స్థాయిలో కోడిపందాలు, పేకాట శిబిరాలను నిర్వహించారు. నందివాడ మండలంలోని నందివాడ, పుట్టగుంట, పోలుకొండ, గండేపూడి, గుడ్లవల్లేరు మండలంలోని గుడ్లవల్లేరు, వేమవరం, అంగలూరు, కూరాడ, డోకిపర్రులలో కోడి పందాలు, పేకాట నిర్వహించారు. నందివాడ మండలం, ఏలూరు జిల్లా, పెదపాడు మండలం సరి హద్దుల్లో భారీ పేకాట శిబిరాన్ని నిర్వహించారు. బరుల్లో మద్యం ఏరులైపారింది. మేకావారిపాలెం, మంగినపూడి, చిన్నాపురం, భోగిరెడ్డిపల్లిలలో పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. వందల సంఖ్యలో జూదరులు కోడిపందేల్లో పాల్గొన్నారు. లోపల బయట పెద్ద ఎత్తున జూదం ఆటలు నిర్వహించారు.
ఆదర్శంగా నిలిచిన ఘంటసాల
సంక్రాంతి సందర్భంగా జూదక్రీడలకు దూరంగా సంప్రదాయ పోటీల్లో ఘంటసాల ఆదర్శంగా నిలిచింది. దివంగత ఎన్నారై గొర్రెపాటి నవనీత కృష్ణ జ్ఞాపకార్థం ఫక్తు రైతువారి పొటీలైన ఒంగోలు జాతి ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. ఎడ్ల పోటీలు, జలదీ శ్వరస్వామి ఆలయం దగ్గర ముగ్గులపోటీలు నిర్వహించారు.