విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారితో పాటు ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:27 PM
విజయవాడలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడంతో.. ముందున్న ట్యాంకర్‌ను కారు బలంగా ఢీకొట్టింది.
కృష్ణా జిల్లా, జూన్ 30: జిల్లాలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్డులో ఈరోజు(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కంటైనర్.. కారును వెనక నుంచి ఢీకొట్టడంతో.. ముందున్న ట్యాంకర్‌ను ఆ కారు బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కంటైనర్, ట్యాంకర్ మధ్యలో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వెళ్తున్న బైక్‌ను కూడా ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు.
ప్రమాదం జరిగిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కంటైనర్, ట్యాంకర్‌కు మధ్యలో కారు నామరూపాలు లేకుండాపోయింది. మృతదేహాలు కారు లోపలే ఇరుక్కుపోయిన పరిస్థితి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పొక్లెయినర్ సాయంతో కారును బయటకు తీసి.. అందులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే నంబర్-1
ఐపీఎస్ సునీల్ కుమార్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన ‘క్యాట్’
Read Latest AP News And Telugu News