విజయవాడలో జనసేన కీలక భేటీ.. పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం..
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:11 PM
విజయవాడలో జనసేన పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
విజయవాడ: నగరంలో జనసేన పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సాగిన ‘రావణ్ ఎపిసోడ్’పైనా సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడంతో పాటు, పార్టీ శ్రేణులు ప్రజల్లో మరింత చురుగ్గా ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జనసేనాని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో నిర్వహించనున్న ‘జనగళం’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా సమస్యలు స్వీకరించే కార్యక్రమంపై చర్చ జరగనుంది. ఈ కార్యక్రమాలకు పార్టీకి చెందిన ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘జనగళం’తో పాటు మరికొన్ని ప్రజా కార్యక్రమాల బాధ్యతలనూ పార్టీ నేతలకు అప్పగించే యోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాలపై పర్యవేక్షణ పెంచాలని దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నియోజకవర్గాలలో సర్ కార్యక్రమాన్నీ పర్యవేక్షించి.. ఓట్లు మిస్ కాకుండా చూసేలా పవన్ సూచనలు చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. చికిత్స నిమిత్తం పవన్ కల్యాణ్ రేపు(శుక్రవారం) ముంబైకి వెళ్లనున్నారు. శస్త్రచికిత్స అనంతరం సుమారు 30 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల వారీగా కార్యకలాపాల వేగవంతం వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారులకు తీవ్రగాయాలు..