Share News

దుర్గగుడిలో ఇన్‌స్టా రీల్ కలకలం.. యువతిపై పోలీసులకు ఫిర్యాదు..

ABN , Publish Date - Aug 02 , 2026 | 04:56 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ యువతిపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుర్గగుడిలో ఇన్‌స్టా రీల్ కలకలం.. యువతిపై పోలీసులకు ఫిర్యాదు..
Indrakeeladri Instagram Reel

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువతిపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. దేవస్థానం ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ యువతిపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల దుర్గామాత ఆలయంలోని మహామండపం ఏడో అంతస్తు రాజగోపురం వద్ద ఓ అపరిచిత యువతి డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఈ విషయం ఆలయ అధికారుల దృష్టికి వెళ్లింది.


దేవస్థానం ఈవో వి.కె.శీనా నాయక్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇవాళ (ఆదివారం) ఉదయం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. సదరు యువతి జులై 30న మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 1:47 గంటల మధ్య వీడియో చిత్రీకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రెండు నిమిషాల పాటు ఆమె వీడియో చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసినట్లు తెలిపారు. దేవదాయ శాఖ నిబంధనలు, ఆలయ పవిత్రతకు ఇది పూర్తిగా విరుద్ధమని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.


ఈ మేరకు యువతిని గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను అధికారులు కోరారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

జులైలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

Updated Date - Aug 02 , 2026 | 05:06 PM