ఆదివాసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబే ప్రధాన కారణం: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:42 PM
నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు.
విజయవాడ, ఆగస్టు 09: నేడు ఆదివాసీలు గౌరవంగా జీవిస్తున్నారంటే అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గతంలో ఎవరూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాకే.. ఆదివాసీ దినోత్సవం సంబరంగా జరుగుతుందని గుర్తు చేశారు. నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. స్కూల్ అఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా రెండు లక్షల మంది గిరిజనులు చదువుకొంటున్నారని వివరించారు.
నేడు ప్రతి క్లాస్‌కి ఓ టీచర్ ఉన్నారంటే అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కారణమని పేర్కొన్నారు. యాభై ఏళ్లకే గిరిజనులకు సీఎం చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం 18 పధకాలను రద్దు చేసి గిరిజనులు పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎంగా చంద్రబాబు వచ్చాక ఆ 18 పధకాలను మళ్లీ అమలు చేశారని చెప్పారు. ఈ రెండేళ్లల్లో రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదార్లు, మౌలిక సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఫీడర్ అంబులెన్స్‌ల సృష్టికర్త చంద్రబాబు అని అన్నారు.
పర్మిషన్ లేని ప్రదేశాల్లో కూడా నేడు రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే కొండలు, వాగు లు దాటే పరిస్థితి ఉండేదని.. కానీ నేడు నేరుగా తండాల నుంచి ఆసుపత్రికి వెళ్లేలా రోడ్లు వేశారని వివరించారు. చంద్రబాబు సారధ్యంలో గిరిజన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తాగునీరు కూడా లేని పరిస్థితి ఉన్న అన్ని గ్రామాలకు మంచి నీటిని సీఎం చంద్రబాబు అందించారని పేర్కొన్నారు.
పోటీ పరీక్షల్లో వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించారని అన్నారు. గిన్నీస్ బుక్ రికార్డులో గిరిజనులు చోటు దక్కించుకున్నారని చెప్పారు. యోగా, ధింసా నృత్యాల ద్వారా మనకీ ఓ రికార్డు వచ్చిందంటే అది సీఎం చంద్రబాబు ప్రోత్సాహం వల్లే అని మంత్రి సంధ్యారాణి వివరించారు. మనసాక్షి లేని సాక్షి పత్రిక దీనిని కూడా వక్రీకరించిందని మండిపడ్డారు. తాము అవహేళన చేసినట్లు అబద్ధాలు రాశారని చెప్పారు. 13 వేల మంది చేసిన నృత్యాన్ని అవమానించిన సాక్షి పై కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివాసీలకు దగ్గరయ్యేలా సీఎం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు: ఎంపీ కేశినేని శివనాథ్
అరకు కాఫీ విశిష్టతను విశ్వవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది సీఎం చంద్రబాబు నాయుడేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. మొన్న ప్రధాని పర్యటన లో కూడా అరకు కాఫీ ప్రత్యేక ఎట్రాక్షన్ అయ్యిందని గుర్తు చేశారు. ఆదివాసీలకు దగ్గర అయ్యేలా సీఎం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని వివరించారు. తన నియోజకవర్గంలో 22 తండాలకు సీఎం చంద్రబాబు మంచి నీటి సౌకర్యం కల్పించారని వివరించారు.
మన రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఉండటం గర్వకారణమని అన్నారు. బడ్జెట్‌లో 29 శాతం ఆదివాసీలకు లోకేశ్ కేటాయించారని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర అంటే చిట్ట చివరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేలా మనమందరం సహకారం అందించాలని ప్రజలకు ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.
గిరిజనులను మోసం చేసిన ఘనుడు వైఎస్ జగన్: ఎమ్మెల్యే జయకృష్ణ
గిరిజనులను మోసం చేసిన ఘనుడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మండిపడ్డారు. జీవో నెంబర్ 3 తెచ్చి గిరిజనులు హక్కులను కాల రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల కష్టాలను ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు సీఎంగా నాడు, నేడు గిరిజనులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. నేడు ఈ ప్రాంతాల్లో కొత్త వెలుగులు చూస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.
ఆదివాసీ దినోత్సవాన్ని పండుగలా చేస్తున్న సీఎం: ఎమ్మెల్యే బొండా ఉమా
సీఎం చంద్రబాబు విజన్ ద్వారా నేడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత ప్రభుత్వం మాటలతో ఆదివాసీలను మోసం చేస్తే.. సీఎం చంద్రబాబు వారి ప్రాంతాలతోపాటు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని సీఎం చంద్రబాబు పండుగలా చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ట్విట్టర్‌లో శుభాకాంక్షలు పెట్టి ఊరుకునే వారని గుర్తు చేశారు.
నేడు సకల సౌకర్యాలతో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని వివరించారు. మెగా డీఎస్సీలో1,300 మంది ఆదివాసీలు టీచర్లు అయ్యారని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించారని అన్నారు. నేడు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారని.. గతంలో డోలీలలో కిలోమీటర్లు నడిచే పరిస్థితి గిరిజనులకు ఉండేదని ఎమ్మెల్యే బొండా ఉమా వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్
ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదు: టీపీసీసీ చీఫ్
For More AP News And Telugu News