CM Chandrababu Kanuma Greetings: కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 16 , 2026 | 08:19 AM
కనుమ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. కనుమ అనేది రైతు జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని ఆయన పేర్కొన్నారు.
అమరావతి: కనుమ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే కనుమ అనేది రైతు జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని ఆయన పేర్కొన్నారు. తమ వ్యవసాయానికి సహకరిస్తున్న పశువుల పట్ల కృతజ్ఞత వ్యక్తపరచే రోజు కనుమ అని తెలిపారు.
ఈ పండుగ కేవలం సంప్రదాయంగా జరుపుకునే వేడుక మాత్రమే కాదని, మనిషి–ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే పర్వదినమని సీఎం అన్నారు. పశుసంపదే రైతుల నిజమైన ఆస్తి అని స్పష్టం చేశారు. పొలాల్లో నాగలి లాగుతూ కష్టపడే ఎద్దులు, కుటుంబాలకు పోషణ అందించే పాడిపశువులు ఇవన్నీ రైతు జీవితంలో విడదీయరాని భాగమని వివరించారు.
రైతు శ్రమ వెనుక పశువుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్న చంద్రబాబు, వాటిని గౌరవించడం మన సంస్కృతిలోని గొప్ప సంప్రదాయమని అన్నారు. ఈ విలువలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదేనని సూచించారు. మూగజీవాలను కంటికి రెప్పలా చూసుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని గుర్తుచేశారు.
ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి కూడా మనపై కరుణ చూపుతుందని సీఎం తన సందేశంలో తెలిపారు. పశుపక్ష్యాదుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత నిలుస్తుందని, అప్పుడు వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పశువులకు సరైన మేత అందేలా చూడటం, వాటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం విషయంలో ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కనుమ పండుగ రైతుల ఇళ్లలో సంతోషం, సంపద, పాడిపంటలు నింపాలని ముఖ్యమంత్రి కోరారు.
ఇవి కూడా చదవండి
ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు
సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలం: సీఎం చంద్రబాబు