Share News

చాలా అంశాల్లో మంత్రులు వెనకబడిపోతున్నారు.. ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:50 PM

ఏపీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు.

చాలా అంశాల్లో మంత్రులు వెనకబడిపోతున్నారు.. ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం
AP Cabinet Meeting

అమరావతి, జులై 23: రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైన ఉద్యోగాలు కోసం మరోసారి అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై మరింత దృష్టి సారించాలని సీఎం సూచించారు. చాలా అంశాల్లో మంత్రులు వెనుకబడిపోతున్నారని సీఎం అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత, ఆ అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకుని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.


రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి(SIPB)లో ఆమోదం పొందిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో సమీక్షించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్లానింగ్ బోర్డు సమావేశాలను తరచూ నిర్వహిస్తూ, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని సూచించారు. ‘మీ శాఖల్లో ఉన్న సమస్యలను మీరే పరిష్కరించే విధంగా చొరవ చూపాలి. రెండేళ్ల ప్రభుత్వ విజయాలపై మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించినప్పటికీ, వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయారు’ అని చెప్పుకొచ్చారు.


పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన ఘటన, తిరుపతిలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు దొరికిపోయారని ముఖ్యమంత్రి చెప్పారు. డీఎస్సీ పరీక్షల అంశంలో ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మలేదని, కోర్టులోనూ వారికి అనుకూల ఫలితం రాలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ఢిల్లీలో జరిగిన నీట్ ఉద్యమంతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి అంశాల్లో మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గోదావరి పుష్కరాలు, పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒకే రోజు నిర్వహించే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రారంభోత్సవం, గోదావరి పుష్కరాల ప్రారంభ కార్యక్రమాలను విడివిడిగా నిర్వహిస్తే బాగుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశంలో చెప్పినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

అర్ధరాత్రి వైసీపీ నేతల మద్యం పార్టీ.. ఎక్సైజ్ అధికారుల దాడి.. కేసు నమోదు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. చేనేతకు రూ.25 వేల ‘నేతన్న భరోసా’

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 04:01 PM