తప్పుడు ప్రచారం వల్లే ప్యానిక్ రియాక్షన్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఏపీ మంత్రులు
ABN , Publish Date - Mar 14 , 2026 | 02:17 PM
గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ప్యానిక్ అవ్సాల్సిన అవసరం లేదని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీంను ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు.
అమరావతి, మార్చి 14: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశాల మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా, మంత్రి నాదెండ్ల మనోహర్ జూమ్‌లో పాల్గొన్నారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని మంత్రులు తెలిపారు. కానీ, రాష్ట్రంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇండియాలో గ్యాస్ ప్రొడక్షన్‌ను పెంచిందన్నారు. హాస్పిటల్స్, హాస్టల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కడా ఎఫెక్ట్ కాకుండా చూస్తున్నామని మంత్రులు వెల్లడించారు. ప్రజలు గ్యాస్ రాదేమోనని ఆందోళనతో 70 - 80 శాతం ముందస్తు బుకింగ్‌లు చేస్తున్నారని మంత్రులు వివరించారు. అందువల్ల అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వరకు బుకింగ్ సమయం పడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే గ్రామాల్లో డబుల్ సిలిండర్ విధానం 32 రోజుల్లో సప్లై చేస్తున్నారని చెప్పారు.
ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఊరుకోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. ఓటీపీ లేకుండా సిలిండర్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆల్టర్నేటివ్ సప్లై చైన్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. హోటల్స్‌ను రొటేషన్ పద్ధతిలో ఓపెన్ చేయాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారన్నారు. టైమింగ్స్ తగ్గించడం కూడా దీనిలో భాగమని చెప్పారన్నారు. గతంలో చంద్రబాబు చెప్పిన పైప్‌డ్ గ్యాస్ ఇప్పుడు నగరాల్లో వరంగా మారిందని అన్నారు.
ఎక్కడైనా సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లోనే జరగాలని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానం అమలు చేయాలని ఆయిల్ కంపెనీలకు సూచించామని మంత్రులు తెలిపారు. ప్రజల నష్టం, కష్టాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు. గతంలో బొగ్గుతో నడిపే బట్టీలు తిరిగి ప్రారంభిస్తున్నామని హోటల్ యజమానులు చెబుతున్నారని అన్నారు. స్టాండర్డ్ మెనూ ప్రకారం సర్వ్ చేయాలని చాలా హోటల్స్ నిర్ణయించాయని వివరించారు. అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దేవాలయాల్లో ప్రసాదాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వల్లే ప్యానిక్ రియాక్షన్ ఏర్పడుతోందని, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు: హోం మంత్రి అనిత
ఎల్‌పీజీ సరఫరాపై మంత్రుల కీలక సమావేశం
Read Latest AP News And Telugu News