ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకల దాడే: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 27 , 2026 | 03:46 PM
వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు.
అమరావతి, జూన్ 27: వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లారా లేక రాజధానిలో రౌడీయిజం చేయటానికి వెళ్లారా అని ప్రశ్నించారు. ‘మీరు వెళ్తే సమస్య వస్తుందని పోలీసులు ముందే చెప్పారు. మీరు వెళ్లిన పెనుమాకలో 90% రైతులు రాజధానికి భూములు ఇచ్చినవారే. రైతులపై రౌడీయిజం చేయడానికి గూండాలని వెంటబెట్టుకుని వెళ్లారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులే తప్పు చేసినట్టు ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ నేతల వెంట వెళ్లినవారిలో ఎంతమంది రౌడీషీటర్‌లు ఉన్నారో డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం సమాచారం ఉందన్నారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు. అమరావతి ప్రజల కలల రాజధాని ఈరోజు శరవేగంగా ముందుకు వెళుతోందని అన్నారు.
2027 నాటికి అమరావతి పూర్తి కావాలని అందరం అహర్నిశలూ కష్టపడుతున్నామని హోం మంత్రి వెల్లడించారు. ఆనాడు అమరావతి రాజధాని అని ఒప్పుకొని తర్వాత మూడు రాజధానుల డ్రామాలాడారని విమర్శించారు. మరలా ఇప్పుడు మావిగాన్ అంటూ ఏ ముఖం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తారని ప్రశ్నించారు. అమరావతి పూర్తయితే తమకి మనుగడ కూడా ఉండదని వైసీపీ ఈ డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడే అని అన్నారు. జరిగిన ఘటనపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నట్లు తెలిపారు. అమరావతి రైతులు కడుపు మంటతో ఉన్నారన్నారు.
అమరావతి రైతులకు అండగా ఉన్నందుకు గతంలో చంద్రబాబుపై భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ దాడులు చేశారని.. కానీ మేము అలాంటి వాటిని ప్రోత్సహించడం లేదని అనిత అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందని.. విచారణ కూడా చేస్తామన్నారు. వైసీపీ నేతలను అడ్డుకుంది అమరావతి రైతులేనని.. టీడీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు. ఆనాడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీలు, గూండాలు నేడు రాజధాని రైతులపై దాడికి వచ్చారన్నారు. వారందరి విజువల్స్ కూడా ఉన్నాయని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు
వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News