Share News

టూరిస్ట్ బస్సుల యజమానులకు గుడ్‌న్యూస్.. పన్ను తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:47 PM

రాష్ట్రంలో పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా.. పన్నుల తగ్గింపునకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టూరిస్ట్ బస్సుల యజమానులకు గుడ్‌న్యూస్.. పన్ను తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం
Andhra Pradesh tourist bus tax cut

అమరావతి, జూన్ 23: రాష్ట్రంలో పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా.. పన్నుల తగ్గింపునకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ, వాహన యజమానుల సుదీర్ఘ విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం.. ‘అఖిల భారత పర్యాటక పర్మిట్’ (AITP) కలిగిన టూరిస్ట్ బస్సులకు ప్రతి సీటుపై విధించే త్రైమాసిక పన్నును రికార్డు స్థాయిలో తగ్గించారు. ఇప్పటివరకు ఉన్న రూ. 4,000 పన్నును రూ. 2,500కు తగ్గిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.


గతంలో భారీగా ఉన్న పన్నుల భారం కారణంగా ఏపీకి చెందిన పలువురు బస్సు ఆపరేటర్లు తమ వాహనాలను పొరుగు రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తాజా పన్ను తగ్గింపుతో ఆయా రాష్ట్రాలకు వెళ్లిన బస్సుల రిజిస్ట్రేషన్లు తిరిగి ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. తద్వారా రాష్ట్ర రవాణా రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది. వాహన యజమానులపై పన్ను భారం గణనీయంగా తగ్గినప్పటికీ.. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరగుతుంది. అలానే రవాణా శాఖకు వాహనాలపై మెరుగైన పర్యవేక్షణకు అవకాశం లభిస్తుంది.


క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రవాణా రంగ సంక్షేమానికి, ఆపరేటర్ల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఈ నిర్ణయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాకుండా, టూరిస్ట్ బస్సుల భద్రత, ఫిట్‌నెస్ పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని మంత్రి రాంప్రసాద్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని మహిళ ధర్నా

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 23 , 2026 | 06:00 PM