Share News

కృష్ణమ్మ పరవళ్లు..ఆనందంతో చిందులు

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:53 AM

కార్యక్రమంలో నిర్వాసితులు, లబ్ధి పొందే రైతులకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. జలహారతి వద్ద నల్లమల సాగర్‌కు నీరిచ్చే బటన్‌ను రైతులు, మహిళలతో నొక్కించారు. వేదికపై నిర్వాసితులతో జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఇరువైపులా రైతులను కూర్చోబెట్టుకున్నారు.

కృష్ణమ్మ పరవళ్లు..ఆనందంతో చిందులు

కార్యక్రమంలో నిర్వాసితులు, లబ్ధి పొందే రైతులకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. జలహారతి వద్ద నల్లమల సాగర్‌కు నీరిచ్చే బటన్‌ను రైతులు, మహిళలతో నొక్కించారు. వేదికపై నిర్వాసితులతో జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఇరువైపులా రైతులను కూర్చోబెట్టుకున్నారు. బటన్‌ నొక్కగానే.. గేట్లు తెరచుకున్నాయి. 18.8 కిమీ పొడవైన సొరంగం నుంచి కృష్ణా జలాలు వెలిగొండ కాలువలోకి దూకాయి. రెండు గేట్లు తెరవడంతో నీటి ప్రవాహం వేగంగా ముందుకు సాగింది. అది చూసి సీఎం పరవశించిపోయారు. సెక్యూరిటీ ఆగమన్నా ఆగకుండా.. కెనాల్‌లో దిగి జలాలను చేతిలోకి తీసుకుని వాటిని ముద్దాడారు. మళ్లీ నీళ్లు తీసుకుని తన తలపై చల్లుకున్నారు. పక్కనే ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులందరి తలలపైనా చల్లారు. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, టీడీపీ నేతలు ఎరిక్షన్‌బాబు, అశోక్‌, సత్య, వెంకటరాజు తదితరులు చిందులువేశారు. కార్యక్రమానికి ముందు 5వేల మంది గిరిజన బాలికలు లంబాడ నృత్యం చేశారు. సీఎం వారందరితో సెల్ఫీ దిగారు.


  • చెమ్మగిల్లిన కళ్లతో..

ముంపుగ్రామాలైన గుండంచర్ల, కలనూతల సుంకేసులలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపారు. అయినా వచ్చే నీటిని చూసి పోవాలని కొన్ని వందల మంది వేచి

ఉన్నారు. రిజర్వాయర్‌ రెండో వైపు ఉన్న గ్రామాల ప్రజలూ ఆ నీటిని చూసేందుకు పరుగుపరుగున వచ్చారు. అక్కడకు వచ్చిన రైతుల కళ్లు చెమ్మగిల్లి కనిపించాయి. చెర్లోపల్లికి చెందిన యోగయ్య అనే 75 ఏళ్ల రైతు చేతికర్ర సాయంతో కెనాల్‌ వరకు నడిచి వచ్చారు. ‘నేనే కాదు.. నా పిల్లలు కూడా నీరు చూస్తామనుకోలేదు. సీఎం దయవలన నేనే నీళ్లు చూశాను’ అని చేతులెత్తి నమస్కరించి చెప్పారు. సుంకేసుల రిజర్వాయర్‌లోకి వచ్చిన నీటిని ఒక రైతు బాటిల్‌లోకి తీసుకోవడం కనిపించింది. ఎందుకని ప్రశ్నిస్తే మా భవిష్యత్‌కు బంగారు బాటలు చేసే నీటిని ఇంటికి తీసుకెళ్లి చల్లుకుంటానంటూ ఆనందంగా చెప్పారు.

  • నీరు లేని ప్రాజెక్టును ప్రారంభించి జగన్‌ చరిత్రలో నిలిచిపోయారు: మంత్రి లోకేశ్‌

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జగన్‌ జాతికి అంకితం చేసి, ప్రజలను మోసం చేశారని మంత్రి లోకేశ్‌ విమర్శించారు. సోమవారం ఆయన ఎక్స్‌లో... ‘2024లో నీరు లేకుండానే ప్రారంభోత్సవం చేసిన ఘనత జగన్‌ది. నీరు లేని ప్రాజెక్టును ప్రారంభించిన వ్యక్తిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోయారు. వెలిగొండకు ఫేక్‌ ఇనాగరేషన్‌ చేసింది వైసీపీ అయితే వెలిగొండ కలను సాకారం చేసింది చంద్రబాబు. ఇదే వాస్తవం.. ఇదే నిజం’ అని పేర్కొన్నారు. ‘వలసల కష్టాలకు సెలవు చెబుతూ, అభివృద్ధికి స్వాగతం పలుకుతున్న మార్కాపురం జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగాలు చేసిన నిర్వాసితులకు ధన్యవాదాలు. 30 ఏళ్ల కలను నిజం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రజలకు మంచి చేయడం ద్వారా వారి అభిమానాన్ని పొందడమే మేం కోరుకునే క్రెడిట్‌. వెలిగొండ జల సిరులు.. అభివృద్ధికి రెక్కలు. ఇది నినాదం కాదు.. కూటమి ప్రభుత్వ విధానం’ అని మరో పోస్టులో పేర్కొన్నారు.


  • ఎక్స్‌లో మొదటి స్థానంలో ‘వెలిగొండ’ ట్రెండింగ్‌

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెలిగొండ ప్రాజెక్టు ట్రెండింగ్‌లో నిలిచింది. సీఎం చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంపై నెటిజన్లు ఆసక్తి చూపడంతో ఎక్స్‌లో ‘సీబీఎన్‌ ఫుల్‌ఫిల్స్‌ వెలిగొండ డ్రీమ్‌’ (వెలిగొండ కలను సాకారం చేసి చంద్రబాబు) హ్యాష్‌ ట్యాగ్‌తో మొదటి స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది.

  • ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పంచెకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. ఫీడర్‌ కాలువ ద్వారా నలమల సాగర్‌కు నీరు వదిలి జలహారతి ఇచ్చే కార్యక్రమంతోపాటు బహిరంగ సభలోనూ పంచెకట్టుతోనే ఉన్నారు. కెనాల్‌లో దిగాక పంచె తడవడంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. పంచె మార్చుకోవాలని సూచిస్తూ పక్కనే ఏర్పాటుచేసిన తాత్కాలిక గది వైపు దారిచూపారు. కాదంటూ కాలినడకన ఆయన ముందుకు సాగారు.

  • సభలో రైతులకు సంఘీభావంగా కండువాను చేతిలో పట్టుకుని ఊపుతూ ర్యాంపుపై తిరిగి ప్రజలను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

  • ఉద్యోగులు, అధికారులను, నేతలను ప్రత్యేకంగా పిలిచి శిలాఫలకం వద్ద ఫొటోలు దిగారు.

  • వేదికపై తన పక్కనే ఉన్న మంత్రులు రామానాయుడు, సత్యప్రసాద్‌, దుర్గేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌లతో సీఎం తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతటి భగీరథ యత్నం చేయాల్సి వచ్చిందో క్లుప్తంగా వివరించారు.

-మార్కాపురం, ఆంధ్రజ్యోతి


ఇవి కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..


పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 04:53 AM