కృష్ణా జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. తల్లిదండ్రుల ఆందోళన
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:29 PM
కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
కృష్ణా, నవంబర్ 8: జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండలం వార్పూలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ గ్రామానికి చెందిన లంకె కుమార్ రాజా (15) అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
పాఠశాలలోని హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విద్యార్థి మృతి చెందినట్లు యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బందే బాలుడిని హత్య చేసి ఉరివేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అసలు తమ కుమారుడికి ఏం జరిగిందో తేల్చాలని, ఘటన వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. విద్యార్థి మృతితో తీవ్ర ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో అవనిగడ్డ–నాగాయలంక ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా, విద్యార్థి మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు