శ్రీశైలంలో విద్యుదుత్పత్తి.. తక్షణమే ఆపండి
ABN , Publish Date - Sep 05 , 2026 | 05:01 AM
శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. తాగునీటి అవసరాల కోసమే కృష్ణా జలాలను వాడుకోవాలని స్పష్టం చేసింది.
తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశం
తాగునీటి అవసరాల కోసమే కృష్ణా
జలాలను వాడుకోవాలని స్పష్టీకరణ
పోతిరెడ్డిపాడు నుంచి నీరు తక్కువగా
తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచన
66:34 నిష్పత్తిలోనే పంపిణీ జరగాలి
97 టీఎంసీలివ్వండి: ఏపీ ఈఎన్‌సీ
తెలంగాణ 200 టీఎంసీలు కోరడంపై
అభ్యంతరం.. తేలని నీటి పంచాయితీ!
నెలాఖరులో బోర్డు విస్తృత స్థాయి భేటీ
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. తాగునీటి అవసరాల కోసమే కృష్ణా జలాలను వాడుకోవాలని స్పష్టం చేసింది. సాగు, విద్యుత్ అవసరాల్లో సాగునీటికే జలాలు వాడాల్సి ఉంటుందని.. విద్యుత్, తాగునీటి అవసరాల్లో తాగునీటికే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన చట్టం మేరకే నీటి కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
శుక్రవారం హైదరాబాద్ జలసౌధలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీశ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈఎన్‌సీలు కె.నరసింహమూర్తి, రవికుమార్‌తో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. చర్చలు ఆద్యంతం వాడీవేడిగా సాగాయి. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్, రాష్ట్ర విభజన చట్టం మేరకు రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాలను తాగునీటి అవసరాల కోసం 66:34 నిష్పత్తిలో వాటాలు పంచాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. తెలంగాణ మాత్రం తనకు 70 శాతం వాటా రావాలని.. ఎల్‌నినో ప్రభావం ఉన్నందున కృష్ణా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి కోసం చెరిసగం పంచుకునేందుకు తాము అంగీకరిస్తున్నామని తెలిపింది. దీనిని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 66:34 నిష్పత్తిలో ప్రస్తుతం తమకు రావలసి ఉన్న నాలుగు టీఎంసీలకు అదనంగా 97 టీఎంసీలను కేటాయించాలని బోర్డును కోరారు.
చెరువులన్నీ నింపుకొంటాం: తెలంగాణ
అయితే 66:34 నిష్పత్తికి అంగీకరించేది లేదని.. రెండు రాష్ట్రాలకూ చెరిసగం కేటాయించాలని తెలంగాణ ఈఎన్‌సీ వాదించారు. అక్టోబరు దాకా తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయించేందుకు తాము అంగీకరించబోమని.. ఈ ఏడాది చెరువులన్నింటినీ నింపుకొనేందుకు తమకు 200 టీఎంసీలు కేటాయించాలని పట్టుబట్టారు. అయితే శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 142 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయని నరసింహమూర్తి గుర్తుచేశారు. భవిష్యత్‌లో ఎగువ నుంచి వరద వస్తుందన్న ఆశల్లేవని.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడమూ అనుమానమేనన్నారు. శ్రీశైలం డ్యాంలోని 142 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లోని 179 టీఎంసీలను 2026-27 నీటి సంవత్సరంలో తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సి ఉండగా.. చెరువులన్నీ నింపుకొంటామని తెలంగాణ అనడంపై అభ్యంతరం తెలిపారు. తాగునీటి అవసరాలకే నీరు చాలదని ఆందోళన ఉంటే.. చెరువులు నింపుకొంటామనడం ఏంటని ప్రశ్నించారు. శ్రీశైలం డ్యాం నీటిని తెలంగాణ భారీఎత్తున విద్యుదుత్పత్తికి వినియోగిస్తోందని బోర్డుకు ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకెళ్తోందని రవికుమార్ కంప్లయింట్ ఇచ్చారు. తక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు బోర్డు సూచించింది. విద్యుదుత్పత్తి నిలిపివేయాలని సమావేశంలో బోర్డు, ఏపీ పలు సార్లు కోరినా.. ఆ రాష్ట్రం ఖాతరు చేయలేదు. దీంతో భేటీ ముగిసిన వెంటనే కేఆర్‌ఎంబీ తెలంగాణకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. విద్యుత్ అవసరాల కోసం నీటి వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టం-2014 11వ షెడ్యూల్‌లోని 2, 3 పేరాలను అనుసరించి నీటి వినియోగం ఉండాలని స్పష్టం చేసింది. సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తిలో తాగునీటికే అత్యంత ప్రాధాన్యం ఇస్తామని.. అందుచేత విద్యుదుత్పాదన వెంటనే నిలిపివేయాలని తేల్చిచెప్పింది. రెండు రాష్ట్రాలూ తాగునీటికే నీటిని వినియోగించాలని స్పష్టంగా పేర్కొంది. మరోవైపు.. తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల కేటాయింపులపై త్రిసభ్య కమిటీ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ నెలాఖరులో రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులతో కూడిన పూర్తి స్థాయి భేటీలో నిర్ణయం తీసుకుందామని కేఆర్‌ఎంబీ కార్యదర్శి సతీశ్‌కుమార్ చెప్పారు.
ఈ వార్తలను కూడా చదవండి
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా