Gandikota: గండికోట ఉత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం.. శోభాయాత్రతో సరికొత్త వైభవం!
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:54 PM
కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కడప, జనవరి 11: కడప జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గండికోట (భారతదేశ గ్రాండ్ కాన్యన్)లో నేటి నుంచి (జనవరి 11 నుంచి 13 వరకు) నిర్వహిస్తున్న గండికోట ఉత్సవాలు 2026 ఘనంగా మొదలయ్యాయి. ఈ సాయంత్రం నిర్వహించిన శోభాయాత్రతో ఉత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర గండికోట చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని అద్భుతంగా ప్రతిబింబించింది.

పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే రాజకీయ వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు, రంగురంగుల ఆకర్షణలతో శోభాయాత్ర అద్భుతంగా సాగింది. కుటుంబ సమేతంగా తరలివచ్చిన స్థానికులు, పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

శోభాయాత్రలో ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్.సవిత, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, కడప టీడీపీ నేత భూపేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

ఈ మూడు రోజుల ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ కాన్సర్ట్‌లు (మంగ్లి, రామ్ మిరియాల, డ్రమ్స్ శివమణి వంటి ప్రముఖుల ప్రదర్శనలు), డ్రోన్ షో, ఫైర్ క్రాకర్స్, హెలికాప్టర్ రైడ్స్ (రూ.3000కి తగ్గించారు), పారాగ్లైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీలు ఉంటాయి.

అదనంగా 270° ఆడియో-విజువల్ డోమ్‌లో గండికోట చరిత్రపై డాక్యుమెంటరీ కూడా ప్రదర్శిస్తారు. గండికోట ఉత్సవాలు రాయలసీమ సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలను ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం. ఇక్కడ శోభాయాత్ర, సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద నృత్యాల దృశ్యాలతో ఈ ఉత్సవాలు గండికోటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..