బలంగా ఉన్న చోట ‘జడ్పీ’ బరిలో!
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:01 AM
జడ్పీ చైర్మన్ల స్థానాలకు సంబంధించి జనసేన బలంగా ఉన్న చోట పోటీలో ఉంటామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికి జడ్పీ స్థానాలపై సృష్టత వస్తుందని, నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
చైర్మన్ల స్థానాలపై నేడు స్పష్టత: నాదెండ్ల
పరిషత్ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలి
జనసేన ఎన్నికల సమన్వయ కమిటీలో నిర్ణయం
అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జడ్పీ చైర్మన్ల స్థానాలకు సంబంధించి జనసేన బలంగా ఉన్న చోట పోటీలో ఉంటామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రానికి జడ్పీ స్థానాలపై సృష్టత వస్తుందని, నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల్లో మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. సమావేశం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నామినేషన్ల తీరు, జనసేన పోటీ చేస్తున్న ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు.
ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పిన అంశాలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కమిటీ సభ్యులకు నాదెండ్ల మనోహర్ వివరించారు. కూటమి పార్టీ నేతలతో సమన్వయం చేసుకొని, ఎన్నికల్లో బలంగా నిలబడాలని సూచించారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని ఆదేశించారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ.. అభ్యర్థులకు భరోసా ఇవ్వాలన్నారు. సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, బొలిశెట్టి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం