Share News

ఓటరు తీరుమారేనా?

ABN , Publish Date - Oct 26 , 2026 | 01:28 AM

స్థానిక సంస్థలకు ఎన్నికలంటే ఎక్కడైనా సందడి ఉంటుంది.

ఓటరు తీరుమారేనా?

స్థానిక ఎన్నికల్లో ఓటువేసేందుకు ముందుకురాని నగరవాసులు

సాధారణ ఎన్నికలతో పోల్చితే తక్కువ ఓటింగ్‌ నమోదు

2024 సాధారణ ఎన్నికలో 70 శాతం పోలింగ్‌

2021 జీవీఎంసీ ఎన్నికలో 59 శాతం మించని వైనం

అందులోనూ ఒకశాతం నోటాకు, రెండుశాతం చెల్లనివి

ఇదీ జీవీఎంసీ ఎన్నికల్లో ఓటర్ల సరళి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థలకు ఎన్నికలంటే ఎక్కడైనా సందడి ఉంటుంది. స్థానిక పాలనలో భాగస్థులైతే తమప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందనే భావనతో పోటీకి దిగుతుంటారు. స్థానికులు కూడా తమకు నిస్వార్థంగా సేవచేసే వారిని, అభివృద్ధికి కృషి చేస్తారని భావించేవారిని ఎన్నుకునేందుకు మొగ్గుచూపుతారు. ఈ నేపథ్యంలో ప్రతి వీధిలో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ నగరంలో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొనడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ శాతం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదు కాకపోవడం దీనికి బలం చేకూర్చుతోంది.

జీవీఎంసీ పరిధిలో 120 వార్డులు, 1,990 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 18,37,901 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు ఒకటిన జరిగే ఎన్నికల్లో మేయర్‌ పదవికి 15 మంది పోటీపడుతుండగా, 120 వార్డుల్లో కార్పొరేటర్‌ పదవికి సుమారు 1,625 మంది రంగంలో ఉన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం పోటీలో నిలిచినవారంతా ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. కొందరు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పార్కులు, గేటెడ్‌ కమ్యూనిటీలకు వెళ్లి ప్రచారం చేయడంతోపాటు మందీ మార్బలంలో ప్రచారం చేసి వస్తున్నారు. ప్రతీ ఓటరును నేరుగా కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఈ పరిస్థితిలో పోలింగ్‌రోజున ఓటింగ్‌ శాతం భారీగా నమోదు కావాలి. కానీ జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటింగ్‌ శాతం తక్కువగానే నమోదవుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే సాధారణ ఎన్నికలతో పోల్చితే అతి తక్కువ నమోదవుతుంటుంది.

గత ఎన్నికల్లోనూ అంతే...

జీవీఎంసీకి 2021లో జరిగిన ఎన్నికల్లో 17,26,158 మంది ఓటర్లుండగా, వారిలో కేవలం 10,25,442 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. దాదాపు 41 శాతం మంది ఓటు వేయలేదు. అదే 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సుమారు 70 శాతం మంది ఓటర్లు ఓటు వేయడం గమనార్హం. నగర శివారు ప్రాంతాలు, మురికివాడలు తదితర ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం కాస్త ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ సంపన్నులు, కేంద్ర ప్రభుత్వరంగ ఉద్యోగులు, నేవీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఓటింగ్‌ తక్కువగా ఉంటోంది. సాధారణ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ రాష్ట్రంలో లేదా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి, మెరుగైన పాలన అందించేవారికి ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తిచూపుతున్నారు. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏముందిలే?.. పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేవారు కాదు అనే భావనతో చాలామంది ఓటు వేయడానికి విముఖత చూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, తమ పోలింగ్‌కేంద్రం ఎక్కడో తెలుసుకుని వె ళ్లడం కాస్త ఇబ్బందిగా భావించి కొందరు ఓటు వేయడానికి ఆసక్తిచూపడం లేదని మరికొందరు చెబుతున్నారు. అలాకాకుండా జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ఓటరు స్లిప్పులను పోలింగ్‌కు రెండు, మూడు రోజులు ముందుగానే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి, పోలింగ్‌కేంద్రం గురించి వివరంగా చెప్పగలిగితే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంటుందని మరికొందరు సూచిస్తున్నారు.

నేడు కూటమి జడ్పీటీసీ అభ్యర్థుల జాబితా

విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగు జడ్పీటీసీ స్థానాలకు కూటమి అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించనున్నారు. ఒక సీటు ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. కానీ టీడీపీ నేతలు సుముఖంగా లేరనే వాదన వినిపిస్తోంది. జడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కాగా జనసేన పార్టీకి ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - Oct 26 , 2026 | 01:28 AM