Share News

పులివెందులలో జగన్ యాగీ

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:02 AM

కడప జిల్లా అంటే వైఎస్‌ అడ్డా! వార్డు మెంబర్లు మొదలు ఎమ్మెల్యే వరకు అక్కడ ఎవరు నిలబడినా వైఎస్‌ కుటుంబానికి చెందిన వ్యక్తే గెలుస్తూ ఉండేవారు

పులివెందులలో జగన్ యాగీ
YS Jagan Mohan Reddy

  • అడ్డగోలు అబద్ధాలు..రోజంతా హడావుడి ఒంటి గంటకు వస్తారని పోలీసులకు సమాచారం

  • 10 గంటలకే పులివెందులకు మాజీ సీఎం

  • దీంతో హెలికాప్టర్‌కు అనుమతిలో సమస్య

  • వాస్తవం దాచి..‘నేషనల్‌ మీడియా’

  • వేదికగా దుష్ప్రచారం

  • ఓటు వేయకుండానే బెంగళూరుకు పయనం

(కడప - ఆంధ్రజ్యోతి)

కడప జిల్లా అంటే వైఎస్‌ అడ్డా! వార్డు మెంబర్లు మొదలు ఎమ్మెల్యే వరకు అక్కడ ఎవరు నిలబడినా వైఎస్‌ కుటుంబానికి చెందిన వ్యక్తే గెలుస్తూ ఉండేవారు. అంతలా పులివెందులను ఆ కుటుంబం భయపెట్టేది. అయితే కాలం ఒకేలా ఉండదు. పులివెందుల ప్రజల్లో కూడా మార్పు వస్తోంది. మున్సిపోల్స్‌లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. అయితే, ఓటమి భయంతో ముందునుంచే జగన్‌ పులివెందులపై డ్రామాకు పక్కాగా ప్లాన్‌ చేశారు. అందులోభాగంగా ఇటీవల జగన్‌ పులివెందులకు వచ్చారు. ‘పోలింగ్‌ ముందురోజు పులివెందులకు వస్తా. చొక్కా మడిచాం. ఎవరు వస్తారో రండి.’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ, నామినేషన్లు పూర్తయ్యి పోలింగ్‌కు ముందే కడప జిల్లాలో వైసీపీకి దెబ్బపడింది. జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఉంటే ఐదు స్థానాలను టీడీపీ, ఒకస్థానం బీజేపీ గెలిచాయి. పులివెందుల, జమ్మలమడుగు, కడప కార్పొరేషన్‌ ఎన్నికలు వైసీపీకి చావు బతుకుల వ్యవహారంగా మారింది. పోలింగ్‌ సరళిని గమనిస్తే, జగన్‌కు అక్కడా నిరాశ తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారమంతా జగన్‌ పులివెందులలో పలు రకాల డ్రామాలను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు.


అసలు ఏం జరిగింది.?

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు పులివెందులకు జగన్‌ వస్తున్నట్లు వైసీపీ ట్వీట్‌ చేసింది. దాని ఆధారంగా మధ్యాహ్నం 12.50 గంటలకు హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే ఉదయం 9.45 గంటలకు జగన్‌ పులివెందుల చేరుకున్నారు. ల్యాండింగ్‌కు వెంటనే అనుమతి లభించకపోవడంతో 15 నిమిషాల తర్వాత, 10గంటలకు హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది. ఇది వాస్తవం కాగా, ల్యాండింగ్‌కు అధికారులు సమస్యలు సృష్టిస్తున్నారంటూ జగన్‌, వైసీపీ నేతలు వదంతులు వ్యాప్తి చేశారు. నేషనల్‌ మీడియా వేదికగా యాగీ చేశారు. పక్కా ప్రణాళికతో జాతీయ మీడియా, బ్లూమీడియా, కొందరు యూట్యూబ్‌ చానెల్స్‌ను వెంట తెచ్చుకొని, ఎన్నికల నిర్వహణలో ప్రజాస్వామ్యం దెబ్బతినింది అనే విధంగా హంగామా చేయాలని చూశారు.

ఓటు వేయని జగన్‌

పులివెందుల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా జగన్‌ చిన్నమ్మ వైఎస్‌ ప్రమీల బరిలో ఉన్నారు. జగన్‌ బాకరాపురంలో ఓటు వేయాల్సి ఉంది. కానీ, ఆయన ఏజెంట్ల పేరుతో కొందరిని తీసుకెళ్లి మధ్యాహ్నం 12 గంటల సమయంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ‘70 మంది ఏజెంట్లు ఇక్కడే ఉన్నారు. నేను ఓటు వేస్తాననే భయంతో నా బూత్‌లో మాత్రం ప్రశాంతంగా ఏజెంట్లను కూర్చోబెట్టారు. మిగతాచోట్ల మా వారిని లోనికి రానివ్వడం లేద’ని ఆరోపించారు. వాస్తవం ఏమిటంటే, పోలింగ్‌ కేంద్రాల్లోని వైసీపీ ఏజెంట్లను జగనే బయటకు పిలిపించారు. ధర్నా డ్రామా నడిపించారు. మరికొన్నిచోట్ల, వైసీసీకి చెందిన చాలా మంది ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దాన్ని పట్టుకొని జగన్‌ నానా యాగీ చేశారు.


తొలిసారి టీడీపీ పాగా?

వైసీపీ హయాంలో పులివెందులలో ఎవరైనా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లు కూర్చుంటే, పీకలు కోసేవారు. ఈసారి చెదురు మదురు ఘటనలు తప్ప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. తొలిసారిగా పులివెందులలో టీడీపీ పాగా వేస్తుందనే ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. కడప కూడా టీడీపీదే అంటూ చాలా చోట్ల ప్రచారం సాగింది. ఎన్నికలను పరిశీలించి చూస్తే.. పులివెందుల మున్సిపాలిటీ, కడప కార్పొరేషన్‌, జమ్మలమడుగు టీడీపీ వశం అవుతాయనే ప్రచారం సాగుతోంది. వాస్తవం తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

Updated Date - Nov 02 , 2026 | 06:05 AM