జగన్ ఇంట్లోనే లిక్కర్ స్కెచ్!
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:36 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో అసలు లబ్ధిదారు నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డేనని అప్పటి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. జగన్ ఇంట్లోనే ఈ స్కాం స్కెచ్ వేశారని..
ఆయనకు 3200 కోట్లు అందాయ్!
మద్యం స్కాం కేసులో మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ సంచలన వాంగ్మూలం
డిస్టిలరీస్ నుంచి నెలకు 60 కోట్లు వసూలు
కమీషన్ ఇస్తేనే బ్రాండ్‌కు బూస్ట్.. ఇవ్వని కంపెనీలకు మొండిచేయి
ఆటోమెటిక్ ఓఎఫ్‌ఎస్‌కు మాన్యువల్ మలుపు
సాఫ్ట్‌వేర్ నిలిపివేత.. మెయిల్‌తో ఆర్డర్లు.. 29 డిపోల డేటా చేరవేత
సత్యప్రసాద్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు..
విచారణ ఎల్లుండికి వాయిదా
విక్రయాలపై కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు ఆర్డర్లు అందేవి. ధరలు పెంచేవారు. ముడుపులివ్వని కంపెనీలకు ఆర్డర్లు నిలిపివేసేవారు.
ఏ బ్రాండ్‌కు ఆర్డర్ ఇవ్వాలి, ఏ బ్రాండ్‌కు ఇవ్వకూడదనే విషయాన్ని కసిరెడ్డి గ్యాంగ్ చూసుకునేవారు.ఒక్కో మద్యం కేసుపై కనీసం రూ.300 వసూలు చేసి.. మిథున్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమలో తాము పంచుకుని.. అంతిమంగా జగన్‌కు చేరవేసేవారు.
- వాంగ్మూలంలో సత్యప్రసాద్
అమరావతి/విజయవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో అసలు లబ్ధిదారు నాటి సీఎం జగన్మోహన్‌రెడ్డేనని అప్పటి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. జగన్ ఇంట్లోనే ఈ స్కాం స్కెచ్ వేశారని.. ఆయనకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, బాలాజీ గోవిందప్ప తదితరుల ద్వారా రూ.3,200 కోట్ల ముడుపులు అందాయని వెల్లడించారు. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారతానని సత్యప్రసాద్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వాంగ్మూలాన్ని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎల్.తేజోవతి శుక్రవారం నమోదు చేశారు. అనంతరం విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో 40 మంది నిందితుల ప్రమేయంపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సత్యప్రసాద్ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పలువురు న్యాయవాదులు, సిట్ అధికారుల సమక్షంలో ఐదు గంటల పాటు న్యాయమూర్తికి లిక్కర్ స్కాం వివరాలను పూసగుచ్చినట్లు తెలియజేశారు. వాంగ్మూలంలో ఆయన ఏం చెప్పారంటే..
నాన్‌కేడర్ ఐఏఎస్ ఇస్తామన్నారు..
‘ఎక్సైజ్ శాఖలో 2007లో చేరిన నేను బేవరేజెస్ కార్పొరేషన్‌లో పనిచేస్తుండగా.. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వాసుదేవరెడ్డి ఎండీగా వచ్చి చేరారు. నేను వేరే శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లే ప్రయత్నంలో ఉండగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి బావమరిది మదన్‌మోహన్‌రెడ్డిని కలిశాను.. నాన్ కేడర్ ఐఏఎస్ లేదా తుడా కార్యదర్శిగా పోస్టింగ్ అడిగాను.. అయితే మద్యం విక్రయాలు, కమీషన్ల వ్యవహారం చూడాలని నాకు చెప్పారు. కన్‌ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నాతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ సీజీఎం ఆంజనేయప్రసాద్‌కు కమీషన్ల వసూలు బాధ్యత అప్పగించారు. ఏపీ స్పెషల్ కార్పొరేషన్ నుంచి చౌక మద్యం బ్రాండ్ల క్యాప్స్, సమాచారాన్ని సేకరించి వారికి ఇచ్చా.. ఆ తర్వాత తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలో లిక్కర్ పాలసీని ఖరారుచేశారు. ఈ భేటీలో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, కసిరెడ్డి, సుమిత్ తదితరులు పాల్గొన్నారు. సేల్స్ డేటాను పరిశీలిస్తే.. నెలకు 50-60 కోట్ల ముడుపులు అంది ఉండొచ్చు. ఈ ముడుపుల వసూళ్లు చూడాలని నాకు, వాసుదేవరెడ్డికి ఆదేశాలు అందాయి. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి వెనుక ఉండి చూసుకుంటారని చెప్పారు.
మద్యం ఎగుమతి, దిగుమతులు, రవాణా, నష్టాలు తదితర బాధ్యతలన్నీ మాకే ఇచ్చారు. వాసుదేవరెడ్డి, అవినాశ్‌రెడ్డికి పర్యవేక్షణ అప్పగించారు. నాకు నాన్ కేడర్ ఐఏఎస్ పోస్టు ఇస్తామని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు. బేవరేజెస్ కార్పొరేషన్‌లోనే ఉండిపోయాను. 2019 నవంబరు 27న విక్రయ నివేదికలు, స్టాక్ కొనుగోళ్ల బాధ్యతను నాకు అప్పగించారు. అయితే సుమిత్ అలియాస్ అవినాశ్‌రెడ్డి బ్రాండ్లను నిర్ణయించే వారు. ఏ-1 రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి బ్రాండ్ల సరఫరా ఖరారుచేసేవారు. సైఫ్, అనూషా విక్రయాల డేటా సిద్ధం చేసేవారు. డిస్టిలరీస్ నుంచి వసూలు చేయాల్సిన కమీషన్ల డేటాను సైఫ్ రెడీ చేసి కసిరెడ్డికి, వాసుదేవరెడ్డికి ఇచ్చేవాడు. వారు ఆ వివరాలను చాణక్యకు పంపితే.. ఆయనతో పాటు సైఫ్, కిరణ్, సందీప్, చిట్టి, మల్లేశ్ ప్రతినెలా ముడుపులు వసూలుచేసి ప్రకాశ్‌కు ఇచ్చేవారు. ప్రకాశ్ వాటిని కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు పంపేవాడు. డిస్టిలరీస్ యజమానులతో సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడి.. 29 డిపోల విక్రయాలు, బ్రాండ్ల సమాచారాన్ని ఇచ్చేవారు. విక్రయాలపై కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీలకు ఆర్డర్లు అందేవి. ధరలు పెంచేవారు. ముడుపులివ్వని కంపెనీలకు ఆర్డర్లు నిలిపివేసేవారు. 2019కు ముందున్న ఆటోమేటిక్ విధానం స్థానంలో 2020 జనవరిలో మాన్యువల్ విధానం తెచ్చారు. బ్రాండ్లను బట్టి నెలకు రూ.27-30 లక్షలు తీసుకునేవారు. ఏ బ్రాండ్‌కు ఆర్డర్ ఇవ్వాలి, ఏ బ్రాండ్ ఇవ్వకూడదనే విషయాన్ని కసిరెడ్డి గ్యాంగ్ చూసుకునేవారు. ఒక్కో మద్యం కేసుపై కనీసం రూ.300 వసూలు చేసి..
మిథున్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమలో తాము పంచుకుని.. అంతిమంగా జగన్‌కు చేరవేసేవారు. సీటెల్ ఏపీ విధానాన్ని నిలిపివేసి డిస్టిలరీస్‌కు వశిష్ట సాఫ్ట్‌వేర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఓఎఫ్ఎస్ కోసం పూర్ ఆర్డర్ అనే జీమెయిల్ నుంచి వివరాలు తీసుకునేవారు. కొన్ని కంపెనీలకు ఏపీలో డిస్టిలరీలు లేకపోయినా వాటి పేర్లతో సుప్రీమ్ బ్లెండ్, దారూహౌస్, బ్రిలియంట్ బ్లెండ్ వంటి బ్రాండ్ల విక్రయాలు భారీగా జరిగాయి. జీవో 401ద్వారా మద్యం ధరలు అమాంతం పెంచి వాసుదేవరెడ్డి ఆమోదంతో 20కి పైగా నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. అత్యధిక ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకు ఆర్డర్లు చ్చారు.’
ఫీల్డ్ మానిటర్ల నియామకం..
‘మద్యం రిటైల్ షాపుల విక్రయాల జీవో ఇచ్చినప్పుడు ఫీల్డ్ మానిటర్ల వ్యవస్థ గురించి ప్రస్తావనే లేదు. కానీ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి 200 మంది మానిటర్లను నియమించారు. రజత్‌భార్గవ ఈ నియామకాలు చేపట్టారు. వీరంతా కిరణ్‌కుమార్‌రెడ్డికి సంబంధించినవారే. వాళ్లకు జీతం రూ.20-25 వేలు ఇవ్వాల్సి ఉండగా రాజ్ కసిరెడ్డి, తుకేకుల కిరణ్ 10-15 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ము స్వాహాచేశారు. మద్యం రవాణాను మొదట జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షించాయి. అనంతరం సిగ్మా అనే కసిరెడ్డి సంస్థకు అప్పగించి ఒక్కో కేసుకు ఏకంగా రూ.36 చొప్పున దండుకున్నారు. మద్యం సీసా మూతలనూ వదల్లేదు. ఒక్కో మూతకు 30 పైసలు ఉంటే ఏకంగా 65పైసలు చెల్లించేలా చేసి కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. మద్యం బ్రాండ్లను తొక్కేసి వీరికి కమీషన్లు ఇచ్చిన ఐదు డిస్టిలరీలు రాడికో ఖైతాన్, ఎస్‌ఎన్‌జే, ఎస్పీవై, అలెన్ బ్లెండర్స్, తిలక్‌నగర్‌లను పెద్దఎత్తున ప్రోత్సహించారు. వాటి బ్రాండ్లను విస్తృతంగా విక్రయించారు.’
నోట్‌ఫైళ్లలో మార్పులు..
‘2023 నవంబరు 2న ఓఎఫ్‌సీ నోట్ ఫైళ్లలో మార్పులపై నాటి నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ధనుంజయ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించారు. వీటికి నేను, రామ్ శివ హాజరయ్యాం. 2024 జనవరి 22, 23, 25, 29, 30 తేదీల్లో జరిగిన భేటీలకూ వెళ్లాం. పీఎస్ఆర్ ఆంజనేయులు, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు రజత్ భార్గవ, వివేక్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా నోట్‌ఫైల్స్ స్థానంలో ఓఎఫ్ఎస్ సిస్టమ్‌లోకి ఎలా మారాలో చర్చ జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెన కున్న భవనంలో ఈ సమావేశం జరిగింది. విజయవాడ కరెన్సీ నగర్‌లోని యలమంచిలి హైట్స్‌లోని 501ఫ్లాట్‌లో జరిగిన సమావేశాల్లో కమీషన్లు, వసూళ్లు, మద్యం విక్రయాలు తదితర కీలక అంశాలపై చర్చలు జరిగాయి. డిస్టిలరీస్ నుంచి దరిదాపు రూ.3,200 కోట్ల ముడుపులు వసూలు చేసి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప తదితర వీఐపీలు ఆ మొత్తాన్ని జగన్మోహన్‌రెడ్డికి పంపారు.’
ఈ వార్తలనూ చదవండి...