కొత్త పెన్షన్లకు 19,166 దరఖాస్తులు
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:15 PM
ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు జిల్లాలో విశేష స్పందన లభించింది.
కేటగిరీల వారీగా విభజించిన తర్వాత పరిశీలన
అత్యధికంగా చింతపల్లి మండలంలో 2,073,
అత్యల్పంగా డుంబ్రిగుడలో 1,498
పాడేరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు జిల్లాలో విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ పెన్షన్లకు సంబంధించి 19,166 మంది దరఖాస్తులు చేశారు. అర్హులైన వారంతా ఈనెల 7 నుంచి 16 తేదీ వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని తొలుత ప్రభుత్వం సూచించినా, తర్వాత మరో రెండు రోజులు(18 వరకు) గడువు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలోని 11 మండలాలు, 212 గ్రామ సచివాలయాల పరిధిలో వివిధ సామాజిక పెన్షన్లకు సంబంధించి 19,166 దరఖాస్తులు అందాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ జి.జయకృష్ణ తెలిపారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 2,073 దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా డుంబ్రిగుడలో 1,498 దరఖాస్తులు వచ్చాయి. అనంతగిరి మండలంలో 1,615, అరకులోయలో 1,534, జి.మాడుగులలో 1,742, జీకేవీధిలో 1733, హుకుంపేటలో 1,850, కొయ్యూరులో 1,668, ముంచంగిపుట్టులో 1675, పాడేరులో 1789, పెదబయలు మండలంలో 2,039 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. అయితే వాటిలో ఏ కేటగిరీకి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయనేది విభజించాల్సి ఉంది. అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి, అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేస్తారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన కొత్త పింఛన్ల ప్రక్రియపై అర్హులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.