Share News

భూముల కొలతలకు ఎన్నికల చిక్కులు

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:16 AM

స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం భూముల సర్వేపై పడింది. రీ సర్వే విధుల్లో ఉన్న గ్రామ సర్వేయర్‌(వీఎస్‌), గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ) సహా మండల, డివిజన్‌ స్థాయి రెవెన్యూ, సర్వే సిబ్బంది పూర్తిస్థాయిలో ఎన్నికల విధులకు వెళ్తున్నారు.

భూముల కొలతలకు ఎన్నికల చిక్కులు

  • విధుల్లో సర్వేయర్‌, వీఆర్‌ఓలు.. ఎన్నికల అధికారులుగా ఆర్డీఓలు, తహశీల్దార్లు

  • నిలిచిన భూముల సర్వే.. 50 రోజులు టార్గెట్లు వద్దంటున్న ఉద్యోగులు

  • అవకాశమున్న చోటే రీ సర్వే పనులు: సర్వే డైరెక్టర్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం భూముల సర్వేపై పడింది. రీ సర్వే విధుల్లో ఉన్న గ్రామ సర్వేయర్‌(వీఎస్‌), గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ) సహా మండల, డివిజన్‌ స్థాయి రెవెన్యూ, సర్వే సిబ్బంది పూర్తిస్థాయిలో ఎన్నికల విధులకు వెళ్తున్నారు. జిల్లా స్థాయిలో ఇంతకు ముందు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(సర్‌)కు రెవెన్యూ సిబ్బందిని వాడుకున్నారు. ఇది కొనసాగుతుండగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ రావడానికి పక్షం రోజుల నుంచే వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొలతల ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు జిల్లాలు, డివిజన్ల వారీ గా రీ సర్వే టార్గెట్లు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ముగిసేవరకు 50 రోజుల పాటు రీ సర్వేకు విరామం ఇవ్వాలని రెవెన్యూ, సర్వే ఉద్యోగులు కోరుతున్నారు.

ఎన్నికల విధుల్లో తీవ్ర ఒత్తిడిలో ఉన్న తమను రీ సర్వే టార్గెట్ల పేరిట వేధించకుండా ప్రభుత్వం తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై రెవెన్యూ శాఖ ఇప్పటిదాకా స్పందించలేదు. అందుబాటులో ఎవరుంటే వారితో రీ సర్వే చేయించాలన్న ఆలోచన ఉన్నతాధికారవర్గాలకు ఉన్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రీ సర్వేను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖకు టార్గెట్‌ పెట్టారు. అంతకన్నాముందే అంటే ఈ ఏడాది డిసెంబరు నాటికే రీ సర్వేను పూర్తిచేసే ప్రయత్నం చేస్తామని సర్వే డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ చెబుతున్నారు. గత ఆరేడు నెలలుగా సర్‌ ప్రక్రియ వల్ల టార్గెట్‌లు అనుకున్నస్థాయిలో ముందుకుసాగడం లేదు. ఒక దశలో గ్రామ సర్వేయర్లు ఒత్తిడి భరించలేక సమ్మె చేయాలన్న భావనకు వచ్చారు. చివరకు సర్వే అధికారులు వారిని బుజ్జగించారు. ఇలా ఉండగానే, ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రక్రియ ముందుకొచ్చింది.


డిసెంబరు 5 వరకు ఎన్నికల విధులు

డిసెంబరు 5 వరకు ఆర్డీఓ, తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌, రీ సర్వే డీటీ, ఆర్‌ఐలు, వీఆర్‌ఓ, వీఎస్‌లు ఎన్నికల డ్యూటీలో ఉంటున్నారు. కొన్ని చోట్ల రోజంతా వారిని ఎన్నికల డ్యూటీలకు వినియోగించుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో సర్వే చేయలేని పరిస్థితి ఏర్పడింది. సర్వేకు నోటీసులు ఇవ్వడం, ఈ కేవైసీలు చేయడం అసాధ్యంగా మారింది. మరోవైపు భూముల కొలతలు అంటే రైతులు కూడా ఇప్పడున్న పరిస్థితుల్లో ముందుకొచ్చే పరిస్థితి లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. వారు కూడా ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నారు. భూముల కొలతలు, ఈకైవీసీ పనులకు రమ్మని నోటీసులు ఇస్తే ఏమాత్రం స్పందించడం లేదని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అంటే.. డిసెంబరు 5 వరకు రీ సర్వే పనులకు తాత్కాలిక విరామం ఇవ్వాలని రెవెన్యూ, సర్వే ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్నికల విధుల్లో తలమునకలైన తమకు రీ సర్వే టార్గెట్‌లు తప్పించాలని, వీసీలు, టీసీల పేరిట తిట్లదండకం ఆపాలని కోరుతున్నారు.

టార్గెట్ల ఒత్తిడి లేదు: సర్వే డైరెక్టర్‌

రీ సర్వే పనుల్లో ఉన్న గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి సర్వేయర్లను ఎన్నికల విధులకు వాడుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సర్వే, సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఉండగా రీ సర్వే టార్గెట్ల అమలు గురించి ‘ఆంధ్రజ్యోతి’ ఆయన్ను సమాచారం కోరింది. ‘ఎన్నికల విధుల్లో ఉండేవారిని రీ సర్వే చేయాలని ఒత్తిడి చేయడం లేదు. అందుబాటులో ఎవరు ఉంటే వారిని రీ సర్వే పనులు చేయమని చెబుతున్నాం. టార్గెట్ల పేరిట ఎవ్వరినీ ఒత్తిడికి గురిచేసే పరిస్థితి లేదు. ఎన్నికల పనులు లేని సమయంలో సర్వేయర్లు తమ రెగ్యులర్‌ డ్యూటీ అయిన రీ సర్వేపై దృష్టిపెట్టాలని ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చాం’ అని కూర్మనాథ్‌ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:17 AM