‘పంచదార్ల కొండపై మైనింగ్’ వివరాలివ్వండి
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:05 AM
అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, పంచదార్ల కొండపై మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం
2.153 హెక్టార్ల పరిధిలో నో మైనింగ్ జోన్‌గా జీవో జారీ: ఎస్‌జీపీ
ఒక మైనింగ్ లీజు మాత్రమే రద్దు చేశారన్న పిటిషనర్
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, పంచదార్ల కొండపై మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, గునులశాఖ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్ల కొండ వద్ద మైనింగ్ లీజు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ అప్పారాయుడుపాలేనికి చెందిన ఉప్పులూరి నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విజయ్ కుమార్ నాయుడు, రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్ సంస్థలకు కేటాయించిన మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘పంచదార్ల కొండపై పురాతన శివాలయం ఉంది. ఆ ప్రాంతాన్ని రక్షిత జోన్‌గా ప్రకటించారు. కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతించడానికి వీల్లేదు’ అని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ... పంచదార్ల కొండ ప్రాంతంలో 2.153 హెక్టార్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేశామన్నారు. ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. పొన్నవోలు స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో మొత్తం మూడు మైనింగ్ లీజులు మంజూరు చేశారని, ఒకటి సిట్టింగ్ ఎంపీ పేరు మీద, మరొకటి అతని డ్రైవర్ పేరు మీద, మరోవ్యక్తి పేరు మీద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఒకటి మాత్రమే రద్దు చేశారని, మిగిలినవాటిలో ఇప్పటికీ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని వివరించారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలి గనులశాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలను కూడా చదవండి
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..