గుంటూరు పోలీసులు గ్రేట్..!
ABN , Publish Date - Sep 03 , 2026 | 05:05 AM
గుంటూరు పోలీసులు చాలా గ్రేట్. పోలీసు స్టేషన్‌లోకి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్(సీఐసీ)నే అడ్డుకున్నారు. సీఎస్‌తో సమాన ప్రొటోకాల్ ఉండే సీఐసీని అడ్డుకున్న ఘనత మీకే దక్కుతుంది.
సీఐసీనే స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు
వ్యంగ్యాస్త్రాలు సంధించిన హైకోర్టు ధర్మాసనం
మూడు నెలలైనా బాలిక ఆచూకీ కనుక్కోలేకపోయారు
నేడు కోర్టు ముందు హాజరుపరచండి.. డీజీపీకి ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘గుంటూరు పోలీసులు చాలా గ్రేట్. పోలీసు స్టేషన్‌లోకి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్(సీఐసీ)నే అడ్డుకున్నారు. సీఎస్‌తో సమాన ప్రొటోకాల్ ఉండే సీఐసీని అడ్డుకున్న ఘనత మీకే దక్కుతుంది. బాలిక మిస్సింగ్ కేసును ఇంత తేలిగ్గా తీసుకుంటారా? మీరు కేసు దర్యాప్తు చేస్తున్నారంటే మేము నమ్మాలా.. ఇలాంటి పోలీసులు ఉండడం ప్రభుత్వానికీ సిగ్గుచేటు’ అని హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పదో తరగతి చదువుతున్న బాలిక మిస్సింగ్ కేసులో గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల తీరుపై మండిపడింది. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఫిర్యాదు ఇచ్చి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆచూకీ కనుక్కోలేదని.. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా ఆచూకీ కనుక్కోలేకపోయినందుకు సిగ్గుపడాలని.. పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. బాలికను షేక్ జాన్ సైదా అనే వ్యక్తి తీసుకెళ్లాడని తెలిసినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
గురువారంలోగా బాలికను కోర్టు ముందు హాజరుపర్చాలని డీజీపీని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈమేరకు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ జి.తుహిన్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి జూన్ 9న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మూడు నెలలు కావస్తున్నా, ఆచూకీ కనుక్కోలేకపోయారని, ఆమెను కోర్టు ముందు హాజరుపర్చి, తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది డీవీ శశిధర్ వాదనలు వినిపించారు.
బాలికను షేక్ జాన్ సైదా అనే వ్యక్తి తీసుకెళ్లాడని తెలిసినా, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తనను పట్టుకోవాలని ఇన్‌స్టాలో పోలీసులకు సవాల్ విసిరాడన్నారు. బాలిక 200గ్రాముల బంగారం, రూ.లక్ష తీసుకెళ్లిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ...‘ఫిర్యాదు జూన్‌లో వచ్చింది. ఇప్పటివరకు ఏం చేశారు? బాలిక తనంతట తానే వెళ్లిందా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరికైనా అమ్మేశారా? ఏమి జరిగిందో తేల్చారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ సహాయ న్యాయవాది కృష్ణప్రణీత్ స్పందిస్తూ... పోలీసులు 3రాష్ట్రాల్లో గాలించారని చెప్పారు. బాలిక తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లారన్నారు. ఆమెను పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... సరైన స్పూర్తితో పనిచేస్తే ఇన్ని రోజులు ఎందుకని వ్యాఖ్యానించింది. బాలికను కోర్టు ముందు హాజరుపర్చాలని డీజీపీని ఆదేశించింది. ఏజీపీ స్పందిస్తూ... డీజీపీకి కాకుండా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... బాలిక ఆచూకీ కనుగొనడంలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని, జిల్లా ఎస్పీ, సంబంధిత ఎస్‌హెచ్‌వోపై కోర్టుకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించింది. డీజీపీకి ఆదేశాలు జారీ చేయడమే సరైందని వ్యాఖ్యానించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..