అమరావతిపై కుల విషం చిమ్మి పబ్బం గడుపుకుంటున్న వైసీపీ నేతలు: భూమిరెడ్డి
ABN , Publish Date - Jun 15 , 2026 | 02:52 PM
ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు.
అమరావతి, జూన్15: ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ ముఠా నిత్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు. సోమవారం రాజధాని అమరావతిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అందరిదని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలోని 34,323 ఎకరాల్లో అన్ని కులాల వారి భూములు ఉన్నాయని ఆయన వివరించారు.
రాజధాని భూముల్లో ఎస్సీ, ఎస్టీలు 32%, రెడ్లు 23%, బీసీలు 14% ఉన్నారు. ఈ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రైతులు కేవలం 18 శాతమే ఉన్నారని చెప్పారు. అధికారిక లెక్కలు స్పష్టంగా ఉన్నా ఒకే కులానికి అంటగట్టడం వైసీపీ కుట్రలో భాగమన్నారు. జగన్ కుటుంబం మొదటి నుంచి రాజకీయ ఎదుగుదల కోసం కులమతాలను వాడిందని గుర్తు చేశారు.
వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి, హత్యలు చేసి రాజకీయ సౌధాలు నిర్మించుకున్నారని వైఎస్ జగన్ కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్సీ నిప్పులు చెరిగారు. నాడు మర్రి చెన్నారెడ్డిని దించడానికి పాతబస్తీలో మతకల్లోలాలు సృష్టించారని వివరించారు. పాతబస్తీ అల్లర్లలో వందలాది మంది సామాన్య ప్రజల మృతికి వైఎస్ జగన్ కుటుంబమే కారణమని విమర్శించారు. వైఎస్ వివేకా గొడ్డలి వేటు నుంచి మెగా డీఎస్సీ వరకు వైసీపీది ఒకటే కుట్ర అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
వైఎస్ వివేకా మరణించినప్పుడు తొలుత గుండెపోటు అంటూ నంగనాచి మాటలు మాట్లాడారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య అని తేలిన తర్వాత 'నారాసుర రక్త చరిత్ర' అంటూ కొత్త సినిమా తీశారన్నారు. వివేకా హత్య కేసులో ఎన్ని మాటలు మార్చారో.. డీఎస్సీలోనూ అవే అబద్ధాలంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదనే దుర్బుద్ధితో కోర్టుల్లో ఏకంగా 240 కేసులు వేశారని వివరించారు.
మొదట పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ లేదన్నారు... తర్వాత అవుట్‌సోర్సింగ్ నవీన్ కథ చెప్పారని వ్యంగ్యంగా అన్నారు. డీఎస్సీ అనేది పూర్తిగా పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) అని ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపించిందన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ (1:1) చేసినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదని తెలుసుకుంటే మంచిదని వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లు అన్నీ పరిశీలించాకే ఫైనల్ లిస్ట్ ఇచ్చామన్నారు. మహిళలు, దివ్యాంగుల రిజర్వేషన్లపైనా వైసీపీ అడ్డగోలు వాదనలు చేస్తోందని మండిపడ్డారు. మెరిటోరియల్ స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన 382 ఉద్యోగాలపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ వైసీపీ నేతల ఆరోపణలను ఖండించారు. స్పోర్ట్స్ కోటాలో కాపు 16, రెడ్డి 10, వైశ్యులు 2, క్షత్రియులు 2, బ్రాహ్మణులు 2, ముస్లిం మైనార్టీ1.. యువతకు ఉద్యోగాలు దక్కాయని గణాంకాలతో సహా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు.
స్పోర్ట్స్ కోటా.. ఓసీల 42 పోస్టుల్లో కమ్మ సామాజిక వర్గానికి వచ్చింది కేవలం 9 మాత్రమే అని పేర్కొన్నారు. నాడు 36 డీఎస్పీ ప్రమోషన్లలో కమ్మవారు ఒక్కరే ఉన్నా...తప్పుడు ప్రచారం చేశారని వివరించారు. నాటి 'డీఎస్పీ' అబద్ధాలనే నేడు 'డీఎస్సీ'లోనూ రిపీట్ చేస్తున్నారని వైసీపీ నేతల వైఖరిని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి వివరించారు.
తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఆదివారం గంజాయి బ్యాచ్‌తో ఫేక్ ధర్నాలు చేశారని విమర్శించారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మీడియా సమక్షంలో, అధికారుల ముందు బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి...
ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..
Read Latest AP News And Telugu News