మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం.. కీలక విషయాలు వెల్లడించిన సోమిరెడ్డి..
ABN , Publish Date - May 20 , 2026 | 02:53 PM
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తీర్మానాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు సభ్యులు హాజరయ్యారు.
అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తీర్మానాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ శ్రేణులకు ప్రతిష్టాత్మకంగా మారిందని అన్నారు.
ఈ మేరకు రెండు రోజుల పాటు నిర్వహించే మహానాడులో మొత్తం 19 తీర్మానాలు ప్రవేశపెట్టాలని తీర్మానాల కమిటీ నిర్ణయించిందని సోమిరెడ్డి తెలిపారు. వీటిలో అండమాన్‌కు సంబంధించి తొలిసారిగా ఒక తీర్మానం మహానాడులో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణ తీర్మానాలు రెండు, మిగతావి ఏపీకి సంబంధించి ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై పలు విమర్శలు గుప్పించారు సోమిరెడ్డి. రెండేళ్లుగా ఏపీలో పౌరులందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారని.. వైసీపీ హయాంలో అలాంటి పరిస్థితి లేదన్నారు.
విధ్వంసానికి మారుపేరుగా గొడ్డలి పార్టీ మారిందని సోమిరెడ్డి మండిపడ్డారు. రెండేళ్లుగా ఏపీ సాధించిన పెట్టుబడులు గతంలో ఎప్పుడూ రాలేదని కొనియాడారు. సీఎం చంద్రబాబు బ్రాండ్, లోకేశ్ కృషి, పవన్ తోడ్పాటు, కేంద్రం మద్దతుతో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు సాధించామని పేర్కొన్నారు. నెల్లూరులో మహానాడు నిర్వహించలేకపోయామనే బాధ ఉన్నప్పటికీ.. పొదుపు చర్యల కోసం హైబ్రిడ్ విధానం తప్పలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రకాశం జిల్లాలో యువకుడి దారుణ హత్య
దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్