పోలవరం టూరిజం హబ్ డిజైన్లపై మంత్రి నిమ్మల సమీక్ష..
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:27 PM
పోలవరం టూరిజం హబ్‌కు సంబంధించిన అధికారులతో పాటు జపాన్ నిప్పాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం టూరిజం హబ్ డిజైన్లపై ఆయన కీలక చర్చ చేశారు.
అమరావతి: పోలవరం టూరిజం హబ్‌కు సంబంధించిన అధికారులతో పాటు జపాన్ నిప్పాన్ కోయి ఏజెన్సీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం టూరిజం హబ్ డిజైన్లపై ఆయన కీలక చర్చ చేశారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వేంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఆర్కిటెక్టులు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల మాట్లాడారు.
ఈ సందర్భంగా పోలవరం టూరిజం హబ్ డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ నెల 13న పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని, పనుల పురోగతిపై ఆయన సమీక్ష చేస్తారని నిమ్మల వెల్లడించారు. అదే రోజు పోలవరం టూరిజం హబ్‌కు సంబంధించిన డిజైన్లను పరిశీలించి సీఎం ఫైనల్ చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు తెలుగుతనం ఉట్టిపడేలా, రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేలా పోలవరం స్పిల్‌వే ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. పోలవరం ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు లైడార్ సర్వే ద్వారా 10 వేల ఎకరాలను గుర్తించామని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు NH-365GB నుంచి NH-516Eను పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానించేలా నేషనల్ హైవేస్ అథారిటీతో చర్చిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకు టూరిజం హబ్‌గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్, హట్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
విజయవాడలో జనసేన కీలక భేటీ.. పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం..
అమరావతి కేబినెట్‌లో రైతులకు శుభవార్త.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్!