సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి.. పవన్ కల్యాణ్ ఘన నివాళులు..
ABN , Publish Date - Aug 21 , 2026 | 08:57 AM
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ప్రఖ్యాత షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి, ప్రపంచానికి వారిద్దరూ అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.
అమరావతి: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ప్రఖ్యాత షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. దేశానికి, ప్రపంచానికి వారిద్దరూ అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఉప ముఖ్యమంత్రి వేర్వేరు పోస్టులు చేశారు.
చంద్రశేఖర్ గొప్ప శాస్త్రవేత్త..
నోబెల్ గ్రహీత డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అసాధారణ ప్రతిభావంతుడని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నక్షత్రాలు, విశ్వం గురించి మానవ అవగాహనను మరింత విస్తరించేలా ఆయన చేసిన పరిశోధనలు చిరస్మరణీయమని కొనియాడారు. ‘చంద్రశేఖర్ పరిమితి’ ఆవిష్కరణతో పాటు నక్షత్రాల నిర్మాణం, పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలు ఖగోళ భౌతిక శాస్త్రంలో కీలకమైనవని తెలిపారు. 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న చంద్రశేఖర్.. ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తల సరసన నిలిచారని డిప్యూటీ సీఎం కొనియాడారు. జ్ఞానాన్వేషణలో ఆయన చూపిన పట్టుదల, కొత్త విషయాలను అన్వేషించాలనే తపన.. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు.
భారత సంగీతాన్ని సరిహద్దులు దాటించారు..
భారతీయ శాస్త్రీయ సంగీతంలో షెహనాయికి విశిష్ట స్థానం కల్పించిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తన సంగీతంతో షెహనాయిని ప్రపంచ వేదికపై గౌరవప్రదమైన స్థానంలో నిలిపారని కొనియాడారు. ఆయన వాయిద్యంలోని ప్రతి స్వరం భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, భక్తి, సంగీత సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. బిస్మిల్లా ఖాన్ సంగీతం భాష, ప్రాంతం, సరిహద్దులను దాటి ప్రజలను ఏకం చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆత్మీయమైన సంగీతం తరతరాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని పేర్కొంటూ.. భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఆయన సంగీతం ఎప్పటికీ నిలిచిపోతుందని కొనియాడారు. ఈ సందర్భంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌కు కూడా పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..
ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..