Share News

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్, లోకేశ్..

ABN , Publish Date - Oct 20 , 2026 | 07:38 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్, లోకేశ్..
Vijayadashami Wishes

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పవిత్రమైన ఈ రోజున దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకున్నారు. ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి ధర్మాన్ని గెలిపించిన రోజు కావడంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు.


ప్రతి పనిలోనూ విజయం సాధించాలి: మంత్రి లోకేశ్

‘చెడుపై మంచి గెలిచిన విజయదశమి సందర్భంగా అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన పవిత్రమైన రోజు ఇది. ఈ శుభదినాన దుర్గాదేవి ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు నిండాలని కోరుకుంటున్నాను. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ధర్మానికి ప్రతీక విజయదశమి: పవన్ కల్యాణ్

‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. దేశ ప్రజలందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరవ భారత రాష్ట్రపతితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో మరింత శోభాయమానంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయస్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తూ.. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

బ్రహ్మాండ నాయకునికి వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం

రప్పారప్పా మనకొద్దు!

Updated Date - Oct 20 , 2026 | 07:38 AM