Share News

భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం.. పవన్ కల్యాణ్ వార్నింగ్

ABN , Publish Date - May 25 , 2026 | 07:59 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ అంతర్గత పరిస్థితులు, కుల రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందించారు..

భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం.. పవన్ కల్యాణ్ వార్నింగ్
Pawan Kalyan Warning

ఇంటర్నెట్ డెస్క్: జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. కుల రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.


కులాలను రెచ్చగొట్టద్దు

తమిళనాడులో రాజకీయాలు చాలా సాఫీగా సాగిపోయాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అక్కడి రాజకీయాలను చూస్తే అసూయ కలిగేంత సులభంగా జరిగాయని అన్నారు. తాను పదేపదే కులం గురించి మాట్లాడుతున్నానని కొందరు విమర్శిస్తున్నారని పేర్కొన్న పవన్‌.. తాను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? మిగతా పార్టీ నేతలు కులం గురించి మాట్లాడటం లేదా? అంటూ ప్రశ్నించారు. కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం సమాజానికి మంచిది కాదని సూచించారు.


బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు?

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన చర్చలపై కూడా ఆయన స్పందించారు. 'నేను అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? వైసీపీ నేత జైలుకెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఒక నాయకుడు జైలుకెళ్తే జనసేన ఎదుగుతుందా?' అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రితో రాష్ట్ర అభివృద్ధి అంశాలపైనే మాట్లాడతాం.. ఇలాంటి ఆరోపణలు చేయడం వ్యవస్థను అవమానపరచడమేనని పవన్ అన్నారు. తాను అమిత్ షాను కలిసింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. 'నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటా.. బలహీనులను కాదు' అని వ్యాఖ్యానించారు. 'మాకు కూడా కోపాలు, బాధలు ఉంటాయి. చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది.. భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాట తీస్తాం' అంటూ పవన్ హెచ్చరించారు.


రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నా..

పదవులు వచ్చిన తర్వాత చాలా మంది జనసేన నాయకులు మెత్తబడిపోయారని, అలాంటి నాయకులు జనసేనకు అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 'మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. శత్రువులు బయట ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు' అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనలో ఉండగలిగేవాళ్లు మాత్రమే పార్టీలో ఉండండి అని స్పష్టం చేశారు. తాను టీడీపీ కోసం కాదు.. రాష్ట్రం కోసం సర్దుకుపోతున్నా.. అంటూ వ్యాఖ్యానించారు. ఇకపై జనసేన కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, వ్యక్తిగతంగా విమర్శిస్తే అదే స్థాయిలో బదులిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు

చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..

Read Latest AP News

Updated Date - May 25 , 2026 | 08:17 PM