ఆధారాలు లేకుండా నాపై నేరం మోపారు: నటి కాదంబరి జెత్వాని లేఖ
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:23 PM
ముంబై నటి కాదంబరి జెత్వాని తనపై నమోదైన కేసు, ఏపీ సీఐడీ ఛార్జ్‌షీట్‌పై స్పందించారు. తాను అమాయకురాలినని, తనపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పేర్కొంటూ మీడియాకు లేఖ రాశారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై నటి, మోడల్ కాదంబరి జెత్వాని తనపై నమోదైన కేసు, దర్యాప్తు అంశాలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అమాయకురాలినని పేర్కొంటూ మీడియాకు ఓ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తనపై సరైన ఆధారాలు లేకుండానే నేరం మోపారని కాదంబరి జెత్వాని పేర్కొన్నారు. తన బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.4.5 లక్షల మొత్తాన్ని రూ.1.32 కోట్లుగా ప్రచారం చేశారని ఆరోపించారు.
కాగా.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్.. నటి జెత్వానిపై 2024 ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. జెత్వాని తనను బ్లాక్‌మెయిల్ చేసి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశారంటూ విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. అయితే విద్యాసాగర్ తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి నిరాకరించినందునే తనను వేధింపులకు గురిచేస్తున్నాడని నటి కాదంబరి జెత్వానీ గతంలో చెప్పారు. నాటి విజయవాడ సీపీ కాంతిరాణా తనను అక్రమంగా కేసులో ఇరికించారని, పోలీసులు తీవ్రంగా వేధింపులకు గురి చేశారని.. సుమారు 45 రోజులపాటు తన జీవితాన్ని దుర్భరం చేశారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తరువాత ఆ కేసును సీఐడీకి బదలాయించారు. జెత్వాని బెదిరింపులకు దిగి విద్యాసాగర్ నుంచి దఫదఫాలుగా డబ్బు వసూలు చేసినట్లు సీఐడీ నిర్ధారించి.. విజయవాడ ఏడో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో జెత్వాని మినహా ఆమె తల్లిదండ్రులు, సోదరుణ్ని నిందితుల జాబితా నుంచి తొలగిస్తున్నామని, ఇందుకు అనుమతించాలని సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై ఫిర్యాదుదారుకు నోటీసివ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
Also Read:
ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ!
లెవెన్త్ క్లాస్ డ్రాపౌట్.. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి..