Share News

లెవెన్త్ క్లాస్ డ్రాపౌట్.. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి..

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:45 PM

11వ తరగతిలో చదువు మానేసిన ఓ యువకుడు డబ్బుల కోసం తప్పుదోవ పట్టాడు. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి అమాయక జనాలను మోసం చేయటం మొదలెట్టాడు. చివరకు పాపం పండి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

లెవెన్త్ క్లాస్ డ్రాపౌట్.. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి..
AI cyber fraud

ఇంటర్‌నెట్ డెస్క్: 11వ తరగతిలో చదువు మానేసిన ఓ యువకుడు డబ్బుల కోసం తప్పుదోవ పట్టాడు. సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి అమాయక జనాలను మోసం చేయటం మొదలెట్టాడు. చివరకు పాపం పండి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రోహిత్ వీరేంద్ర సింగ్ శక్య 11వ తరగతిలో ఉన్నపుడు చదువు మానేశాడు. డబ్బు సంపాదన కోసం తప్పుదోవ పట్టిన రోహిత్ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపాడు.


వారికి అవసరమైన ఫేక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, మాల్వేర్ ఉన్న ఏపీకే ఫైల్స్‌ను ఏఐ సాయంతో తయారు చేసి ఇవ్వటం మొదలెట్టాడు. జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్‌ల నుంచి నడిచే సైబర్ నేరగాళ్ల గుంపులు పెద్ద మొత్తంలో రోహిత్ నుంచి ఫేక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, మాల్వేర్ ఉన్న ఏపీకే ఫైల్స్ కొన్నాయి. వాటిని ఉపయోగించి జనాలను మోసం చేయటం మొదలెట్టాయి. 2026 మే నెలలో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌లో వచ్చిన మాల్వేర్ ఉన్న బ్యాంక్ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ చేశాడు. దీంతో అతడి బ్యాంక్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పోయాయి.


అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ గురించి పోలీసులకు తెలిసింది. పక్కా ప్లాన్‌తో సోమవారం కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ హోటల్ గదిలో ఉన్న రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్‌ను విచారించగా.. అతడు యాప్ డెవలప్ చేయడానికి 15 వేల రూపాయలు.. యాప్ సర్వీస్ కోసం నెలకు 15 వేల రూపాయలు తీసుకునేవాడని తెలిసింది.


ఇవి కూడా చదవండి

మీ భార్యకు ఇలాంటి స్నేహితులు ఉన్నారా? జాగ్రత్త పడాల్సిందే!

టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. సమన్వయ లోపమే కారణమా?

Updated Date - Jul 22 , 2026 | 05:48 PM