వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియదు.. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:49 PM
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అత్యంత దుర్మార్గమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
అమరావతి, మార్చి16: అమరజీవి పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) విగ్రహంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు అత్యంత దుర్మార్గమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కేవలం దోపిడీలు, లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాల విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. సోమవారం అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనపై, ఆయన వ్యక్తిత్వంపై నిమ్మల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ‘ద్రోహం, ఎవరికీ సాయం చేయకూడదనే బుద్ధి జగన్ డీఎన్ఏలోనే ఉంది. సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేసిన చరిత్ర ఆయనది. గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం సుమారు రూ.14 లక్షల కోట్ల అప్పులుచేసి, ఏపీ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చింది. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు చేసింది. ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో జగన్ సమాధానం చెప్పాలి. పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తే.. జగన్ అధికారం కోసం ఆస్తులను, వ్యవస్థను దోచుకున్నారు. త్యాగధనుల విగ్రహాలపై విమర్శలు చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ప్రజల సొమ్మును రక్షిస్తాం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం
జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్