Share News

పెట్టుబడులు, ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా?.. వైఎస్ జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్..

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:02 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఇద్దరం చర్చిద్దామా? అంటూ బహిరంగ సవాల్ చేశారు.

పెట్టుబడులు, ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా?.. వైఎస్ జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్..
Minister Nara Lokesh

అమరావతి, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఇద్దరం చర్చిద్దామా? అంటూ బహిరంగ సవాల్ చేశారు. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌ వేదికగా జగన్‌పై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని మంత్రి లోకేశ్ తెలిపారు. తద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. ఇదే తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మరోవైపు, జగన్ హయాంలో చెప్పుకోవడానికి ఏమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తుంటే, వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు చాలా బిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.


రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని జగన్‌కు లోకేశ్ సవాల్ విసిరారు. చర్చకు సిద్ధమా? లేక బర్నాల్ పంపించాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పోస్టుకు #CreditChorJagan అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.


కాగా, పెట్టుబడులు, యువతకు ఉపాధి వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలుగా మారాయి. ఇలాంటి వేళ గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనతో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరును పోల్చుతూ లోకేశ్ విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

జ్యువెల్లరీ షాపులో చోరీకి యత్నం.. అర్ధరాత్రి వేళ గోడ బద్దలు కొట్టి..

కేంద్ర మంత్రి జైశంకర్‌తో నేపాల్ ప్రధాని బలేంద్ర షా భేటీ..

Updated Date - Nov 22 , 2026 | 09:11 PM