కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం.. స్పందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 10 , 2026 | 03:42 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నియోజకవర్గం నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు ఎంపికైంది.
అమరావతి, మే10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నియోజకవర్గం నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం స్పందించారు. ‘కుప్పంలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం హర్షణీయం. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025 కింద దేశంలో కుప్పం మూడవ స్థానాన్ని సాధించింది.
తద్వారా రూ.1.50 కోట్ల నగదు బహుమతిని గెలుచుకోవడం ఎంతో సంతోషకరం. అభివృద్ధికి అంకితభావం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో కుప్పం నిరూపించింది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రభుత్వ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తున్న కుప్పం ప్రజలకు ధన్యవాదాలు. ఇదే స్పూర్తితో పని చేసి కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుదాం’ అని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అలాగే గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం దక్కుతోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025, నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్-2025 అవార్డుల్లో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని రాష్ట్రం దక్కించుకోవడం గర్వకారణం. పంచాయతీ రాజ్ శాఖను అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రగతి పథంలో నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు. వివిధ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్న శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు నా శుభాకాంక్షలు. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు నిర్వహణ పార్టీకి సంబంధించినది: మంత్రి నారాయణ
అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్
For More AP News And Telugu News