Share News

కొఠియా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒడిశా ప్రభుత్వం: మంత్రి సంధ్యారాణి

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:36 PM

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతం కొఠియా గ్రామాల్లోని ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లోని ప్రజలను ఒడిశా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయడం చాలా దారుణమని అన్నారు.

కొఠియా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒడిశా ప్రభుత్వం: మంత్రి సంధ్యారాణి
gummadi sandhya rani

అమరావతి, నవంబర్ 04: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతం కొఠియా గ్రామాల్లోని ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లోని ప్రజలను ఒడిశా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయడం చాలా దారుణమని అన్నారు. ఏపీలో గ్రామస్థాయిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొఠియా ప్రాంత ప్రజలపై ఒడిశా అధికారులు ఆంక్షలు విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. గిరిజనులను తీసుకెళ్లి దాచేస్తున్నారని తెలిపారు. ఇది దుర్మార్గమైన చర్య కాదా? అని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సూటిగా ప్రశ్నించారు.


గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ఒడిశా అధికారులపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. కొఠియా ప్రాంతంలోని 29 గిరిజన గ్రామాల ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గ్రామస్థాయి ఎన్నికలను బహిష్కరించాలని వారిపై ఒత్తిడి తేవడం చాలా బాధాకరమని అన్నారు. అయితే ఎన్నికలను వాయిదా వేయాల్సిన పని ఎలక్షన్ కమిషన్‌దని తెలిపారు. గ్రామాల్లోకి వచ్చి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? అని ఒడిశా అధికారులను నిలదీశారు.


కొఠియా ప్రాంతంలోని గ్రామాలపై ఎప్పటి నుంచో సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉందని గుర్తు చేశారు. కానీ ఈ స్టేటస్‌ కో ఈ రోజే వచ్చినట్లు ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఒడిశా అధికారుల తీరు పట్ల మంత్రి సంధ్యారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో జరిగే ఎన్నికలను బహిష్కరించాలంటూ కొఠియా గ్రామల్లోని అభ్యర్థులను బెదిరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు, పోలీసులపై ఒడిశా అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఓటు వేయడానికి వీల్లేదంటూ గిరిజనులపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మంత్రి సంధ్యారాణి అన్నారు. కొఠియా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఒడిశా అధికారులు హల్‌చల్ చేస్తూ గిరిజనులను భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులు ఓటు వేయడానికి వస్తారనే భయంతో వారి వాహనాలను స్వాధీనం చేసుకోవటం ఎంత వరకు న్యాయం? అని ప్రశ్నించారు. అమాయక గిరిజనుల స్వేచ్ఛను, వారి ఓటు హక్కును హరించే ప్రయత్నాలను ఎంత మాత్రం సహించేది లేదని ఒడిశా ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. గిరిజనులను భయపెట్టకుండా, వారి హక్కులను గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఒడిశా అధికారులకు మంత్రి సంధ్యారాణి హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు

For More AP News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 02:03 PM