జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలే లక్ష్యం.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:21 PM
రానున్న ఎన్నికల్లో అన్ని జిల్లా పరిషత్, ఎంపీపీ స్థానాలు దక్కించుకోవాలని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు
అమరావతి, నవంబర్ 04: రానున్న ఎన్నికల్లో అన్ని జిల్లా పరిషత్, ఎంపీపీ స్థానాలు దక్కించుకోవాలని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు మనం అండగా నిలిస్తే.. వారు మనతోనే ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితమైందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించామని అన్నారు.
వారికి నామినేటెడ్ పోస్టులు..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో దక్కిన విజయం.. మన బాధ్యతను పెంచిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఫలితాలు కూటమి సంక్షేమం - అభివృద్ధి - సుపరిపాలనకు గుర్తింపు అని అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గుడ్ గవర్నెన్స్.. గుడ్ పాలిటిక్స్ ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని తెలిపారు.
కూటమి ప్రభుత్వ కష్టాన్ని గుర్తించిన ప్రజలు..
ప్రజలకు మంచి చేస్తే.. అన్ని స్థాయిల్లోనూ వారు గుర్తిస్తారని.. మన వెన్నంటే ఉంటారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాన్ని నిరూపించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పడుతోన్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని వివరించారు. మంచికి.. మంచి ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ ఫలితాల ద్వారా ప్రజలు చాటి చెప్పారని అన్నారు. మరింత చక్కటి పాలనను అందించేందుకు ప్రొత్సహాన్ని ఇస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు.
ఈ ఎన్నికల్లో 94 శాతం స్ట్రెయిక్ రేట్..
పట్టణ స్థానిక ఎన్నికల్లో కూడా 94 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించగలిగామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఓడిపోయిన కొన్ని చోట్ల కూడా కూటమి పార్టీలకు చెందిన రెబెల్సే గెలిచారని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న చిన్నపాటి సమన్వయ లోపాల వల్ల కొన్ని స్థానాలు కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూటమి పార్టీల అభ్యర్థులు ఘన విజయం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమం - అభివృద్ధి - సుపరిపాలన ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని అన్నారు.
అందుకే చరిత్ర సృష్టించాం..
ఆర్థిక వ్యవస్థ దివాళా తీసినా సంక్షేమాన్ని అందిస్తున్నామని.. మరో పక్క అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. డీఎస్సీతో టీచర్లు రిక్రూట్మెంట్ల సహా జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలతో మమేకం అవుతూ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. అందుకే చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు సోదాహరణగా చెప్పారు.
మిత్రపక్షాలను గౌరవించుకోవాలి..
రాష్ట్రానికి.. తమకు న్యాయం చేయాలనే ప్రజలు కూటమికి పట్టం కడుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. మిత్రపక్షాలను గౌరవించుకోవాలి.. కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థి అయినా మన అభ్యర్థే అన్నట్టుగా పని చేయాలని కేడర్‌కు సూచించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను మించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలను గెలవాలని వారికి దిశానిర్దేశం చేశారు. చిన్నపాటి పొరపాటు కూడా జరగకూడదని.. పూర్తి సమన్వయంతో పని చేయాలని పార్టీ నేతలను ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు.
కూటమి ధర్మాన్ని పాటించాలని..
కూటమిలో ఐక్యత ఎంత మాత్రం చెడిపోకూడదని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుటుంబంలోనూ.. పార్టీలోనూ... సంస్థల్లోనూ బేధాభిప్రాయాలు ఉంటాయని సోదాహరణగా వివరించారు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టుబడి పని చేయాలి... కూటమి ధర్మాన్ని పాటించాలని శ్రేణులకు సూచించారు. పొత్తు ధర్మాన్ని పాటించని వారిని వదులుకోవడానికి కూడా సిద్దమని ఈ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టారు.
హింసను ప్రేరేపిస్తున్న గొడ్డలి పార్టీ..
సుపరిపాలనతో సమానంగా పొలిటికల్ గవర్నెన్స్ ఉండేలా చూస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ హింసను ప్రేరేపిస్తోంది.. సంయమనం పాటించాలని పార్టీ కేడర్‌కు సూచించారు. ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ ఉనికిని చాటుకోవడానికి కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పారని అన్నారు. ఆ పార్టీ నేతలు సొంత బూత్‌లలోనూ గెలవలేకపోయారని వివరించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జనసేన పార్టీ తరఫున పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ టీడీపీ, ఏపీ బీజేపీ చీఫ్‌లు పల్లా శ్రీనివాస్, పీవీఎన్ మాధవ్‌తోపాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ పుర పోరులో కూటమి గెలుపు హోరు
మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి పొన్నం
For More AP News And Telugu News