Share News

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:47 PM

ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాశారు.

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. 2025-26 రబీ సీజన్‌కు సంబంధించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని(PDPS) వర్తింప చేయాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు.


సీఎం చంద్రబాబు లేఖ.. ప్రధానాంశాలు ఇవే..

'ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారు. మార్కెట్‌లో ఈ పంట ధర రోజురోజుకూ పడిపోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా మొక్కజొన్న ధర రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ.2,400 కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంది. రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉంది.


సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంది. PM-AASHA కింద ధరల వ్యత్యాసాన్ని నేరుగా రైతులకు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా పరిగణించి, ధరల వ్యత్యాసంలో 100 శాతం నిధులను కేంద్రమే భరించాలి. ఈ పథకాన్ని జూన్ 2026 వరకూ పొడిగించాలి. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలి’ అని సీఎం చంద్రబాబు లేఖలో కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్ రెడ్డి రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. మంత్రి వ్యంగ్యాస్త్రాలు..

గూగుల్ డేటా సెంటర్‌ శంకుస్థాపన దేశ చరిత్రలో కీలక ఘట్టం: ఎమ్మెల్సీ అనురాధ

Updated Date - Apr 27 , 2026 | 05:14 PM