Share News

స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 26 , 2026 | 09:06 PM

టీడీపీ మహానాడును ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో 'స్త్రీశక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు.

 స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu On Mahanadu

అమరావతి: టీడీపీ మహానాడు 2026ను ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరోసారి వర్చువల్ విధానాన్నే ఎంచుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున వర్చువల్ రూపంలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.


తెలుగువారు ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం మహానాడు అని, పార్టీకి అది ఒక భావోద్వేగమని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు ద్వారా పార్టీ ప్రజలకు ఏ సందేశం ఇస్తుందో అన్న ఆసక్తి అందరిలో ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. ఈసారి 'స్త్రీశక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో జరిగే మహానాడులో రాష్ట్రస్థాయి నాయకులు కూడా పాల్గొంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉండాలని.. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అన్ని విధాలా సాధికారత సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో కొత్తగా మరో జీసీసీ కేంద్రం

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Updated Date - May 26 , 2026 | 09:17 PM