Share News

జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వం : సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:01 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వం : సీఎం చంద్రబాబు
Chandrababu On Jagan

అమరావతి: సోషల్ మీడియాను కొందరు నేర మనస్తత్వం కలిగిన వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.


హిట్ అండ్ రన్ మనస్తత్వం

జగన్‌ది 'హిట్ అండ్ రన్' మనస్తత్వమని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సంఘటనలు జరిగేలా చేసి, తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, ఏదో ఒక అరాచకం జరిగేలా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెచ్చిపోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ఇలాంటి చర్యలు సైకో మనస్తత్వానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బెయిల్‌పై బయటకు వచ్చి ఆరుగురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో వివరించారు.

జగన్ కూడా అలాంటి నేర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. తనకు సహకరించని వారిపై దాడి చేయడం, వారిని లక్ష్యంగా చేసుకోవడం ఆయన తీరుగా మారిందని విమర్శించారు. జగన్ నమ్ముకునేది రెండే రెండు అంశాలని, ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత కూడా అవసరమని, అప్పుడే నిజం ఏది, అబద్ధం ఏది అనే విషయాన్ని సులభంగా గుర్తించే సామర్థ్యం పెరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.


కలచివేసింది

సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. భవిష్యత్‌లో టెక్నాలజీలో మరిన్ని మార్పులు వస్తాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. అందుకే టీడీపీ నేతలకు వైసీపీ ప్రేరేపణలకు లోనవ్వొద్దని, ఎలాంటి ట్రాప్‌లోనూ పడకూడదని స్పష్టంగా సూచించినట్లు చెప్పారు. టెక్కలి మాజీ ఎమ్మెల్యే వరదా సరోజమ్మ ఆస్తులను కుమారుడు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులను బయటకు పంపించాడని, వారు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ బాధను చెప్పుకోవడం తనను కలచివేసిందని చంద్రబాబు అన్నారు. జగన్ కూడా తల్లి, చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా బయటకు పంపేశారని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకత్వం వల్ల పలువురు ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు.

పెట్టుబడులు రాకుండా చేసేందుకు మావిగన్

జగన్ నేర మనస్తత్వానికి ఉదాహరణ మావిగన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు రాకుండా చేసేందుకు మావిగన్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీనికి అనుబంధంగా ఉన్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) వ్యవహారాన్ని కూడా పూర్తిగా తేల్చాల్సి ఉందన్నారు. ఈ వనరులను సక్రమంగా వినియోగించి ఉంటే రాష్ట్రానికి భారీ స్థాయిలో పరిశ్రమలు వచ్చేవని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read:

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం..

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం: రాజ్‌నాథ్ సింగ్

Updated Date - Jul 11 , 2026 | 01:21 PM