ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం: రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:33 PM
విశాఖపట్నంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. భారత నౌకాదళానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం: భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి (INS Mahendragiri) చేరడం దేశ భద్రతకు మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేసిన ఆయన.. ఇది భారత నౌకాదళ శక్తిని మరింత పెంచే కీలక అడుగని పేర్కొన్నారు. భారత సముద్ర భద్రతలో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదిగిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రంలో ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రశంసించారు.
దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అత్యాధునిక సాంకేతికతపై దృష్టి సారించామని తెలిపారు. ఐదో తరం ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ టెక్నాలజీతో పాటు అండర్‌వాటర్ టార్పెడో వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కర్నూలును దేశంలో ప్రముఖ డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ షిప్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, పూర్తి స్థాయి నిఘా వ్యవస్థలతో భారత సాయుధ దళాలను ఆధునికీకరిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కొత్త సాంకేతికత యుద్ధ అవసరాలకే కాకుండా విపత్తుల సమయంలో ఇతర దేశాలకు సహాయం చేయడంలో కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
భారత్ లక్ష్యం యుద్ధం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వమే తమ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదని, భారత భద్రతకు ముప్పు వాటిల్లితే దేశం ఎలా స్పందిస్తుందో ప్రపంచానికి చూపించిన చర్య అని వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని, భారత్ వ్యతిరేక శక్తులకు అవసరమైన సమయంలో తగిన సమాధానం ఇస్తామని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
మారిటైమ్ విజన్-2030 అమలులో భాగంగా సముద్ర రంగ అభివృద్ధికి ప్రత్యేక మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. షిప్‌బిల్డింగ్ రంగంలో ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని, భారత్‌ను ప్రపంచ స్థాయి షిప్‌బిల్డింగ్, మెరిటైమ్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి మెరిటైమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
Also Read:
ఉప ముఖ్యమంత్రి పవన్ కుడి భుజానికి సర్జరీ పూర్తి.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ..