Share News

ప్రజలు ఇబ్బంది పడకుండా.. పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచాలి: సీఎం ఆదేశం

ABN , Publish Date - Apr 26 , 2026 | 08:49 PM

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సోమవారంలోపు పెంచాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఆదేశించారు.

ప్రజలు ఇబ్బంది పడకుండా.. పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచాలి: సీఎం ఆదేశం

అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా సోమవారం లోపు పెంచాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని వారికి స్పష్టం చేశారు. రేపటికి (సోమవారం) సాధారణ పరిస్థితులు రావాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, వివిధ జిల్లాలో భారీ సంఖ్యలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయంటూ వార్తా కథనాలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం అమరావతిలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ కంపెనీలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


ప్రజలను ఇబ్బంది పెడితే అనుమతులపై పునరాలోచిస్తాం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో పెట్రోల్ డిమాండ్ ఒక్క సారిగా 34 శాతం మేర పెరిగినట్లు సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. అలాగే డీజిల్ వినియోగం కూడా భారీగా పెరిగిందని తెలిపారు. దాంతో ప్రైవేట్ బంకులకు ఆయిల్ సరఫరా నిలిపివేతతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చిందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీంతో ఆయిల్ కంపెనీలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ నిలిపివేతపై ఈ సందర్భంగా కంపెనీలను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెడితే అనుమతులపై పునరాలోచన చేస్తామంటూ ఆయిల్ కంపెనీలను హెచ్చరించారు.


ఈ సమస్య ముందుగానే గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ సంబంధిత ఉన్నతాధికారులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాటల్లో కాదు.. ఫలితాలు చూపించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి టాస్క్ ఫోర్స్‌తోపాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.


నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదని అధికారులకు సూచించారు. వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత రానివ్వొద్దని స్పష్టం చేశారు. రైతులకు కూపన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. సోమవారం నాటికి పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 26 , 2026 | 09:08 PM