Share News

జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీ అధికారుల భేటీ.. పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం

ABN , Publish Date - May 01 , 2026 | 07:13 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు మరో రూ.3,300 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

జలశక్తి శాఖ కార్యదర్శితో ఏపీ అధికారుల భేటీ.. పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, మే 01: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు మరో రూ.3,300 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు రూ.2,300 కోట్లు కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే సెప్టెంబర్ నాటికి మరో రూ.3,300 కోట్ల విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు సమాచారం.


శుక్రవారం న్యూఢిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక చర్చ జరిగింది.


వేగంగా ప్రాజెక్ట్ నిర్మాణం, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ఆయా రాష్ట్రాల్లో ముంపు ప్రభావం, అక్కడ చేపట్టాల్సిన చర్యలతోపాటు ఆ రాష్ట్రాలతో సమన్వయం తదితర అంశాలపై ఏపీ అధికారులతో జల శక్తి శాఖ కార్యదర్శి కాంతారావు చర్చించారు. ప్రాజక్ట్‌ 45.72 మీటర్లతో 194.6 టీఎంసీల పూర్తి స్థాయి నీటి సామర్ధ్యంతో నిర్మాణంపై తదుపరి కార్యాచరణను కార్యదర్శి కాంతారావు నిర్దేశించారు.


ఇక రెండోదశ భూసేకరణ పునరావాస ప్యాకేజీ అమలుకు సంబంధించిన కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల పోలవరం ప్రాజక్ట్, ముంపు ప్రాంతాల్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు. ప్రాజక్ట్ పనులు, ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

Updated Date - May 01 , 2026 | 08:56 PM