గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ
ABN , Publish Date - Aug 04 , 2026 | 08:26 PM
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN) ఏర్పాటు కానుంది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
అమరావతి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో రూ.100 కోట్ల వ్యయంతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (CRIYN) ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని నడింపాలెంలో 15.03 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను నిర్మించనున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక బృందం మంగళవారం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ సంస్థలో 100 పడకల ఆధునిక ఆసుపత్రితో పాటు యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన, శిక్షణ, వైద్య సేవలు ఒకేచోట అందుబాటులో ఉండనున్నాయి. ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించడంతో పాటు పరిశోధనలకు కూడా ఇది కేంద్రంగా మారనుంది.
ప్రాజెక్టు అమలులో భాగంగా మూడు నెలల్లో స్థల అభివృద్ధి, రహదారి, కాలువలు తదితర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ కార్యకలాపాలు 2028 నాటికి ప్రారంభం కానున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Also Read:
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
ఏపీ లిక్కర్ స్కాం.. A9 కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈనెల 18 వరకు రిమాండ్