Share News

ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ

ABN , Publish Date - Nov 01 , 2026 | 07:41 PM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు.

ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
AP DGP Harish Kumar Gupta

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. అయితే, 20 జిల్లాల్లో 41 ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఆయా ఘటనలపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ పేర్కొన్నారు.


ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించినట్లు డీజీపీ తెలిపారు. ఎన్నికల వేళ భారీగా పోలీసు బలగాలను మోహరించామని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించామని చెప్పారు. వీడియోగ్రఫీ, డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలు, సమర్థ యాప్ (Samartha App) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించామని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం సహా మొత్తం 20 జిల్లాల్లో 41 ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈ ఘటనలన్నింటిపైనా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.


ప్రతి ఘటనలోనూ వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, నిందితులను గుర్తిస్తామని హరీశ్ కుమార్ గుప్తా తేల్చి చెప్పారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసినందున పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను అత్యంత పటిష్టమైన భద్రత మధ్య సురక్షితంగా స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ ప్రారంభమయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవడంపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఫలితాలు

Updated Date - Nov 01 , 2026 | 07:50 PM