Share News

పులివెందుల ఎన్నికల్లో జగన్ ఓటు వేయకపోవడంపై మంత్రి అచ్చెన్న తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 07:05 PM

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండా పిరికిపందలా వెనుదిరిగారని మంత్రి ఎద్దేవా చేశారు.

పులివెందుల ఎన్నికల్లో జగన్ ఓటు వేయకపోవడంపై మంత్రి అచ్చెన్న తీవ్ర విమర్శలు
Minister Atchannaidu

అమరావతి: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండా పిరికిపందలా వెనుదిరిగారని మంత్రి ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలోనే ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేకుండా పోయిందన్నారు. ఇన్నాళ్లూ పులివెందులలో రౌడీ రాజకీయాలు నడిపిన జగన్‌కు ప్రజాస్వామ్య ఎన్నికలంటే వణుకు పుట్టిందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఓటర్లను బెదిరించి, అడ్డుకునేందుకు ప్రయత్నించాయని మంత్రి అచ్చెన్న నిప్పులు చెరిగారు.


ఓటర్లపై రాళ్ల దాడులు, మహిళలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు వైసీపీ అరాచక రాజకీయాలకు నిదర్శనమని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజల స్వేచ్ఛను హరించడమే కాకుండా జర్నలిస్టులపైనా దాడులు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా జగన్? అంటూ సూటిగా ప్రశ్నించారు. పులివెందుల జగన్ కుటుంబ జాగీరు కాదని, అక్కడి ప్రజలు ఎవరికీ బానిసలు కాదని నొక్కి చెప్పారు. ఓటు వేయకుండా వెనుదిరిగి, రాజకీయ నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్యం గురించి జగన్ నీతులు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. రాళ్ల దాడులతో ప్రజల సంకల్పాన్ని అడ్డుకోలేరని, బెదిరింపులతో బ్యాలెట్ తీర్పును మార్చలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'జగన్ గుర్తుంచుకో.. పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లింది.. అంతిమ తీర్పు ప్రజలదే' అంటూ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఫలితాలు

Updated Date - Nov 01 , 2026 | 07:09 PM