అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం.. ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎంవో పోస్ట్..
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:22 PM
మానవాళికి మడ అడవులు మొదటి రక్షణ కవచమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంవో స్పష్టం చేసింది. అసాధారణ పర్యావరణ మార్పుల నుంచి తీర ప్రాంత ప్రజలను అవి కాపాడతాయని పేర్కొంది. మడ అడవుల పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
అమరావతి: మానవాళికి మడ అడవులు మొదటి రక్షణ కవచమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంవో స్పష్టం చేసింది. అసాధారణ పర్యావరణ మార్పుల నుంచి తీర ప్రాంత ప్రజలను అవి కాపాడతాయని పేర్కొంది. తుపానులు, పెనుగాలుల ఉధృతి, సముద్ర కోత వంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి రక్షిస్తాయని తెలిపింది. మడ అడవుల పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వాటి ప్రాధాన్యం, ఆవశ్యకతపై ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,000 ఎకరాల మడ అడవులను పునరుద్ధరించి, అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.
డిప్యూటీ సీఎంవో ఎక్స్ పోస్టు..
'మానవాళికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరాలలో మడ అడవులు ఒకటి. అవి ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరానికి సంరక్షకులు. రాష్ట్రంలో 1,053 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం వెంబడి అసాధారణ పర్యావరణ పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి. ముఖ్యంగా తుపానులు, పెనుగాలుల ఉధృతి, సముద్ర కోత, తీవ్రమైన వాతావరణ మార్పుల నుంచి తీరప్రాంత ప్రజల జీవనాధారాలను కాపాడుతూ మనకు మొదటి రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఇవి గొప్ప సముద్ర జీవ వైవిధ్యాన్ని పోషిస్తాయి. మన తీరప్రాంత సమాజాలకు జీవనాధారాన్ని అందిస్తాయి. మడ అడవులను రక్షించడమంటే కేవలం అడవులను సంరక్షించడం మాత్రమే కాదు.. అది ప్రాణాలను కాపాడటం, పర్యావరణ భద్రతను బలోపేతం చేయడం, జీవనాధారాలను సురక్షితం చేయడం.
ఆంధ్రప్రదేశ్ మహా హరిత గోడ ద్వారా మడ అడవుల సంరక్షణపై మా నిబద్ధత ఆచరణలో ప్రతిఫలిస్తోంది. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,000 ఎకరాల మడ అడవులను పునరుద్ధరించి, అభివృద్ధి చేశాం. వాతావరణ మార్పుల నుంచి ఏపీకి సహజ రక్షణ కవచాన్ని బలోపేతం చేయడానికి, మన తీరప్రాంత సమాజాలను కాపాడటానికి మా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తాం. 2026-27 సంవత్సరంలో మరో 4,000 ఎకరాలను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మనల్ని రక్షించే అడవులను మనం కాపాడుకుందాం. పునరుద్ధరించిన ప్రతి మడ అడవి మన తీరప్రాంతాన్ని బలోపేతం చేస్తుంది. సంరక్షించబడిన ప్రతి మడ అడవి ప్రాణాలను, జీవనోపాధులను, భవిష్యత్తును సురక్షితం చేస్తుంది' అని ఎక్స్‌లో పోస్టు పెట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి
కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి..
ముద్రగడ ఉద్యమంతోనే టీడీపీ అధికారాన్ని కోల్పోయింది