Share News

ముద్రగడ ఉద్యమంతోనే టీడీపీ అధికారాన్ని కోల్పోయింది

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:27 AM

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమంతోనే 2019లో టీడీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చిందని ఆ పార్టీ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ముద్రగడ ఉద్యమంతోనే టీడీపీ అధికారాన్ని కోల్పోయింది

  • కాపు వర్గం ఎటు వైపుంటే అటే ప్రభుత్వం

  • టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు

  • గుంటూరులో ముద్రగడ సంతాప సభ

  • అంబటి, బోండా ఉమా చెట్టాపట్టాల్‌

గుంటూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమంతోనే 2019లో టీడీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చిందని ఆ పార్టీ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం ముద్రగడ సంతాపసభ జరిగింది. ఎమ్మెల్యే బోండా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు కోట్ల మందిలో కోటి మందికి పైగా బలిజ, తూర్పుకాపులు, ఇతర కాపు వర్గాలు ఎటువైపు మొగ్గుచూపితే అటు వైపే అధికారం వస్తుందని తెలిపారు. కొన్ని దుష్ప్రచారాల కారణంగా 2019లో ముద్రగడ చేసిన ఉద్యమం కారణంగా టీడీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం కాపుల్లో అలజడి మొదలైందని, కాపుల ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాలని సూచించారు. కాపుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, రాష్ట్రంలో దామాషా ప్రకారం 25 శాతం జనాభా ఉన్న కాపులకు నిధులు, పదవులు దక్కాల్సిందేనన్నారు. అది కాపుల న్యాయమైన ఆకాంక్షేనని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడలో ముద్రగడ పద్మనాభం విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం మాట ఇస్తే తప్పరని తెలిపారు.


ఇచ్చిన మాట కోసం తన పేరును మార్చుకున్నారని, ఇది గర్వపడాల్సిన అంశమని పేర్కొన్నారు. ఆయన పేరు మాత్రమే మార్చుకున్నారు కానీ కులం మార్చుకోలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు లింగంశెట్టి ఈశ్వరరావు, కిలారి రోశయ్య తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ సంతాపసభకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ మంత్రి అంబటి రాంబాబు సరదా సంభాషణలతో కనిపించారు. పక్కపక్కనే కుర్చీలలో కూర్చోవడంతో పాటు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సభ ఆసాంతం బోండా ఉమా వైసీపీ నేతలతో కలివిడిగా కనిపించారు.

Updated Date - Jul 26 , 2026 | 05:29 AM