ప్రజలకు క్షమాపణలు చెప్పి.. రాజకీయాల నుంచి వైదొలుగు జగన్: సోమిరెడ్డి
ABN , Publish Date - Feb 12 , 2026 | 08:11 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజధాని అమరావతిలో ఘాటుగా స్పందించారు.
అమరావతి, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ క్షమించరాని భారీ నేరమని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు (గురువారం) సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ స్కామ్ నేర తీవ్రత స్పష్టమైందని తెలిపారు. రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారుల అండతోనే ఈ స్కామ్ జరిగిందని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. ఇంత భారీ పాపానికి ఒడిగట్టిన నీవు.. ప్రజలకు తలదించుకుని క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.
ఈ స్కామ్ వెనుక..
రాజకీయ పదవులతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నానన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని చెప్పారు. ఇది రూ.3,500 కోట్ల స్కామ్ అని.. రాజ్ కసిరెడ్డికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టే స్పష్టం చేసిందన్నారు. ఈ స్కామ్ వెనుక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా? అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
జగన్‌కు ప్రత్యేక చట్టాలున్నాయా..?
రూ. 200 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ నాటి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణలో నాటి సీఎం కుమార్తెతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి సోదరిని జైలుకు పంపారని ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తు చేశారు. మరి అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక చట్టాలున్నాయా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆరోపణలు వచ్చిన రోజే తలదించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఉండాల్సిందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
10 నెలలుగా జైల్లోనే..
సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర ప్రముఖులందరూ ఈ కేసులో జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారని వివరించారు. కానీ రాజ్ కసిరెడ్డి మాత్రం 10 నెలలుగా జైలులోనే ఉన్నారని చెప్పారు. ఈ స్కామ్ విలువ కేవలం రూ.3,500 కోట్లు మాత్రమే కాదు.. వేలాది మంది ప్రాణాలతోపాటు లక్షలాది మంది ఆరోగ్యం కూడా.. అని ఎమ్మెల్యే సోమిరెడ్డి అభివర్ణించారు. ఈ మద్యం స్కామ్ కారణంగా వేలాది కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని పాపాలు చేసిన మీరు..
కల్తీ మద్యాన్ని పైశాచికంగా నిరుపేదల గొంతులో పోసి... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామాలాడారంటూ మండిపడ్డారు. ఇన్ని పాపాలు చేసిన మీరు.. ప్రజలకు ఏమని సమాధానం చెబుతారంటూ వైసీపీ నాయకులను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంత భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా నోరుపారేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్‌లో క్షమించరాని దోపిడీ జరిగిందని విమర్శించారు. ఇప్పటికే ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు మాత్రం రాలేదంటూ ఆ పార్టీ నేతల వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెదవి విరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్ రెడ్డి
నా పక్కన పైరవీకారులు లేరు.. ఉద్యమకారులే ఉన్నారు: కవిత
For More AP News And Telugu News