ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు వాసుదేవరెడ్డి అరెస్ట్
ABN , Publish Date - Feb 21 , 2026 | 06:45 PM
ఏపీలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డిని పోలీసులు ఇవాళ (శనివారం) అదుపులోకి తీసుకున్నారు..
అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో.. విచారణను సిట్ (SIT) వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన వాసుదేవరెడ్డిని పోలీసులు ఇవాళ (శనివారం) అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ. 3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ కేసులో వాసుదేవరెడ్డి అరెస్ట్ అత్యంత కీలకంగా మారింది.
ఎవరీ వాసుదేవరెడ్డి?
వాసుదేవరెడ్డి వైసీపీ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్‌లో (APSBCL) కీలక బాధ్యతల్లో ఉండి, మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డిని రెండో నిందితుడిగా (A2) సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన కొన్ని మద్యం కంపెనీలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి.
రూ. 3,500 కోట్ల కుంభకోణం..
ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. సిండికేట్లకు మేలు చేస్తూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వాసుదేవరెడ్డి ఇప్పటికే కింది కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
అప్రూవర్‌గా మారతారా?..
ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు బయటపెట్టేందుకు వాసుదేవరెడ్డి 'అప్రూవర్' (సాక్షి)గా మారే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన అప్రూవర్‌గా మారితే.. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.
లావాదేవీలపై సిట్ ఆరా..
వాసుదేవరెడ్డి అరెస్ట్‌తో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. మద్యం సరఫరాలో జరిగిన అవకతవకలు, డిజిటల్ పేమెంట్లకు అవకాశం ఇవ్వకుండా నగదు రూపంలో జరిగిన లావాదేవీలపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఆయన అరెస్ట్ తర్వాత మరికొంత మంది అధికారులు, రాజకీయ నేతలకు నోటీసులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News