ఏపీ ఏఐఎంఎస్-2.0 యాప్‌తో డిజిటల్ సేవలు
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:14 AM
అన్నదాతలకు సాంకేతికతను చేరువ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆడుగు వేసింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఏపీ ఏఐఎంఎస్-2.0 యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వేమూరు, ఏప్రిల్ 14: అన్నదాతలకు సాంకేతికతను చేరువ చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆడుగు వేసింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ఏపీ ఏఐఎంఎస్-2.0(ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సాగు పద్దతుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతి సమాచారం రైతుకు ఒక క్లిక్‌తో అందుబాటులో ఉంటుంది. ఏ సమాచారం కావాలన్నా ఫోన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు కిందిస్థాయి సిబ్బంది ద్వారా ప్రతి రైతుకు అవగాహన కల్పిస్తున్నారు. ఏపీ ఏఐఎంఎస్-2.0 విధానాన్ని రైతు చెంతకు తీసుకెళ్తున్నారు. ఇకపై వ్యవసాయ శాఖ సిబ్బంది కోసం ఎదురు చూసే పనిలేకుండానే ఈ యాప్ ద్వారానే వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లే సులభతరమైన మార్గాన్ని రైతులకు అందిస్తున్నారు.
యాప్‌లో ప్రధాన ఫీచర్లు..
పంటలు ఏ సమయంలో వేయాలో సూచనలు ఉంటాయి. తెగుళ్ల నివారణ, మందులు, గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల ఫోన్ నంబర్ల సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, వ్యవసాయానికి సంబంధించిన రాయితీలు తెలుసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంట నష్టం ఆంచనా వేసే వీలుంది.
యాప్ రిజిస్ట్రేషన్ విధానం..
రైతులు తమ మొబైల్‌లో ఈ యాప్‌ను సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రానికి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లాలి. అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ గ్రామ అసిస్టెంట్ ద్వారా ఏపీ ఎఐఎంఎస్-2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేయించుకోవాలి. ప్రాథమిక వివరాలను వారికి తెలియజేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అధికారులు.. రైతుకు ఒక ప్రత్యేకమైన ఐడీ, పాస్‌వర్డ్‌ను కేటాయిస్తారు. ఆ వివరాలతో లాగిన్ అయ్యి.. కావాల్సిన సమాచారాన్ని రైతులు పొందవచ్చు.
ప్రయోజనాలు
ఈ యాప్ రైతులకు కేవలం సమాచారంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా మేలు చేస్తుంది. మార్కెట్ ధరలు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా సాగు నిర్ణయాలు తీసుకోవచ్చు. అనవసరమైన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి పెట్టుబడిని ఆదా చేయవచ్చు. ప్రభుత్వం అందించే యంత్ర పరికరాలు, కొనుగోలు వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. సమస్య ఏదైనా నేరుగా అధికారులకు యాప్ ద్వారానే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని డిజిటల్ దిశగా నడిపించడమే ఈ యాప్ లక్ష్యం. ప్రతి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సాగులో మెరుగైన దిగుబడులు సాధించాలని ప్రభుత్వం కోరుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతున్న చిన్నారి.. అంతలోనే
జువ్వలదిన్నెపై వైసీపీ నీచ రాజకీయం: మంత్రి అనగాని సత్యప్రసాద్