డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశమైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 09:15 PM
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అమరావతిలో ఇవాళ (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అమరావతిలో ఇవాళ (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపికగా విని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు సబ్సిడీల విడుదలలో తీవ్ర జాప్యం, పరిశ్రమల నిర్వహణకు సంబంధించిన పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం.. ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుంటాం. ప్రతి అంశాన్ని సంబంధిత శాఖలతో సమీక్షించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తాం' అని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సబ్సిడీల అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఎంఎస్ఎంఈ, ఆర్థిక, పరిశ్రమల శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పెండింగ్ సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నట్లు పవన్ వెల్లడించారు. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తక్షణ కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు..
తెలుగు నాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గుమ్మడి గోపాలకృష్ణ: సీఎం చంద్రబాబు